భూమిలోని కోర్ వ్యతిరేక దిశలో తిరుగుతోందా, ఏం జరగబోతోంది?

భూ ఉపరితలం, అంతరిక్షం గురించి అనేక ఏళ్ళుగా పరిశోధనలు జరుగుతున్నాయి. చంద్రుడు, అరుణ గ్రహాలను మానవ ఆవాసాలుగా చేసుకునే సాంకేతికను అందిపుచ్చుకుంటున్న తరుణంలో కూడా భూమి కోర్ (కేంద్రం) భాగం సైన్స్‌కు అంతుపట్టని రహస్యంగానే మిగిలిపోయింది.
భూమి కేంద్ర భాగం 5 వేల కిలోమీటర్ల లోతులో ఉంటే, ఇప్పటి దాకా కేవలం 12 కిలోమీటర్ల దాకా మాత్రమే అన్వేషించగలిగారు.
అయితే, భూ ఉపరితలంతో పోల్చినప్పుడు, భూమి కోర్ నెమ్మదిగా, వ్యతిరేక దిశలో తిరుగుతోందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తల బృందం కనుగొంది.
భూమి కోర్ భ్రమణ వేగం 2010 నుంచి మందగిస్తోందని శాస్త్రవేత్తల బృందం చెప్పింది. అయితే 5 వేల కిలోమీటర్ల లోతులోని కోర్ వరకు తవ్వకుండా శాస్త్రవేత్తలు ఈ నిర్ణయానికి ఎలా రాగలిగారు? భూమి కోర్ భాగం భూ ఉపరితలానికి వ్యతిరేక దిశలో తిరగడం వల్ల ఎటువంటి ప్రభావం పడుతుంది?

మూడు పొరల నిర్మాణం
భూమి నిర్మాణం మూడు విభిన్న పొరలతో కూడి ఉందని పరిశోధకులు నిర్థరించారు.
క్రస్ట్ (భూ పటలం), మాంటిల్, కోర్ (కేంద్రం) అనేవే ఆ మూడు పొరలు.
ఇప్పటిదాకా కోర్ గురించి అనేక ఊహాగానాలు వచ్చాయి. కోర్ గురించి అనేక కల్పిత గాథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. 1964లో ‘జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్’ నవల ప్రచురితమైంది. దీని ఆధారంగా తీసిన హాలివుడ్ సినిమాలు బాగా ప్రాచుర్యం పొందాయి.
అయితే భూమి నిర్మాణాన్ని తేలికగా అర్థం చేసుకోవడానికి మనం దానిని ఓ గుడ్డుతో పోల్చుకుందాం. గుడ్డుపై ఉండే పెంకును భూమి ఉపరితలంగా, తెల్ల సొనను భూమి మాంటిల్ గానూ, పచ్చ సొనను కోర్గాను అనుకోవచ్చు.
భూమి అంతర్ కోర్ భాగం ఇనుము, నికెల్‌తో రూపొందిన గోళాకారంలో ఉంటుంది.
దాని వ్యాసార్థం 1,221 కిలోమీటర్లు. దాని ఉష్ణోగ్రత 5,400 డిగ్రీల సెల్సియస్. అంటే దాదాపు సూర్యుడి ఉష్ణోగ్రత (5,700 డిగ్రీలు)కు దగ్గరగా ఉంది.
గతంలోని అధ్యయనాలు ఈ కోర్ భాగం భూమి నుంచి వేరుగా ఉండేదని, ఓ రకమైన లోహ ద్రవం వల్ల భూమి నుంచి విభజితమై స్వతంత్రంగా పనిచేస్తుందని సూచించాయి. అంటే ఇది ఇది భూమి లోపల స్వతంత్రంగా తిరుగుతుందని, మిగిలిన భూమితో దీనికి సంబంధం లేదని చెప్పేవారు.
కానీ 40 ఏళ్ళలో తొలిసారిగా భూ ఉపరితలానికి కోర్ వ్యతిరేక దిశలో కదులుతోందని, భూమి మాంటెల్ కంటే కోర్ కాస్త నెమ్మదిగా కదులుతోందని తాజా అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.