Real Story: టాటా నానో ఎందుకు ఫెయిలైంది.. మమతా బెనర్జీ, టాటా మధ్య ఏం జరిగింది?
అది ముంబై మహానగరం.. ఓ రోజు సాయంత్రం జోరుగా వర్షం పడుతోంది.. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా ఆ ట్రాఫిక్ లోనే చిక్కుకొని ఉన్నారు. కారు అద్దాలు కిందకు దించి బయటికి చూశారు. వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో పరిస్థితి గందరగోళంగా ఉంది. ఈ క్రమంలోనే రతన్ టాటా చూపు ఒక స్కూటర్ పై పడింది. ఆ స్కూటర్ పై భార్యా, భర్త.. మధ్యలో ఇద్దరు పిల్లలు కూర్చొని ఉన్నారు. ట్రాఫిక్ రద్దీ వల్ల స్కూటర్ ని ముందుకి వెనక్కి తిప్పాల్సి వస్తోంది. ఈ క్రమంలో తల్లిదండ్రుల మధ్యలో కూర్చొన్న పిల్లలు నలిగిపోతున్నారు. ఇంతలో ట్రాఫిక్ కాస్త క్లియర్ కావడంతో వాహనాలు ముందుకు కదిలాయి. అయితే, బురద నీటి వల్ల ఆ స్కూటర్ స్కిట్ కావడంతో తల్లిదండ్రులతో పాటు ఆ పిల్లలు కూడా కింద పడిపోయాడు. రతన్ టాటా ఉలిక్కిపడి.. కిందకు దిగేందుకు ప్రయత్నించగా, ఇంతలోనే ఆ నలుగురూ పైకి లేచి స్కూటర్ ఎక్కి వెళ్లిపోయారు.
మన దేశంలో సామాన్యులకు ఇలాంటివి రోజూ జరిగేవే..! కానీ, ఈ సంఘటన మాత్రం రతన్ టాటాను ఆలోచనలను మార్చేసింది. వేల కోట్ల రూపాయిల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతినైన తాను.. సామాన్య, మధ్య తరగతి ప్రజల రవాణా భద్రత కోసం ఏమైనా చేయగలనా అని ఆలోచనలో పడ్డారు. బైక్ ని సేఫ్టీగా ఎలా మార్చాలి అని బాగా ఆలోచించారు. బైక్ ని ఎలా మార్చినా దాని స్వరూపమే మారిపోతుందని భావించారు. చివరికి, సామాన్యుడికి అందుబాటు ధరలో కారును తీసుకొస్తే.. ఓ చిన్న కుటుంబం హ్యాపీగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు కదా అని ఆలోచించారు.
ఈ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత రతన్ టాటా.. ముంబైలోని ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఆటో మొబైల్ ఇంజనీర్లు అందర్నీ పిలిచారు. “అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు గురించి మీకిప్పుడు చెప్పబోతున్నాను.. మధ్య తరగతి ప్రజల కోసం లక్ష రూపాయిలకే కారు తీసుకురావాలని అనుకుంటున్నాను. ఇది నా డ్రీం ప్రాజెక్టు. కాస్త జాగ్రత్తగా డిజైన్లు తయారు చేసి తీసుకురండి.. మళ్లీ చెప్తున్నా, ఇది నా డ్రీం ప్రాజెక్ట్..” అని రతన్ టాటా ఇంజినీర్లకు చెప్పేశారు.
ఓ పది రోజుల తర్వాత.. రతన్ టాటా మళ్లీ రివ్యూ చేశారు! ఒక్కొక్కరు ఒక్కో కొత్త ఐడియాలు చెప్తున్నారు.. ఇంతలో రతన్ టాటాకు ఓ ఆలోచన వచ్చింది.
సరిగ్గా ఏడాది క్రితమే.. మార్కెట్ లోకి మినీ ట్రక్ టాటా “ఏస్”ను విడుదల చేశారు. ఈ మినీ ట్రక్ కేవలం రెండున్న లక్షల రూపాయిలే! ఆ వాహనం మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది.. వేలాది మంది ఈ వాహనాలు కొనుగోలు చేశారు. ఇప్పుడు లక్ష రూపాయిలకే మార్కెట్‌లోకి కారును తీసుకురావడం అంత తేలికైన విషయం కాదు. అందుకే టాటా ‘ఏస్’ ని రూపొందించిన గిరీశ్ వాఘ్ నేతృత్వంలోని యువ బృందానికే ఈ కారు రూపకల్పన బాధ్యతలను రతన్ టాటా అప్పగించారు. ఈ ప్రాజెక్టు తనకు చాలా ప్రతిష్టాత్మకమైనదని రతన్ టాటా పదే పదే చెప్పారు. దీంతో గిరీష్ వాఘ్ బృందం ఈ కారు తయారీని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. దాదాపు ఏడాది పాటు ఈ ప్రాజెక్టుపైనే పనిచేశారు. పేపర్‌పై డిజైన్ నుంచి కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం వరకు దాదాపు ఏడాదిన్నర సమయం పట్టింది.
అది 2008 జనవరి 10వ తేదీ.. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఆటో ఎక్స్‌పో జరుగుతోంది.
ఈసారి అందరి దృష్టి టాటా మోటార్స్ పైనే ఉంది.
అప్పటికే టాటా సుమో, సియారా, సఫారీ, ఇండికా లాంటి మోడళ్లతో మార్కెట్‌లో టాటా ఆధిపత్యం కొనసాగుతోంది.
కానీ, ఆ రోజు జరిగే ఎక్స్ ప్రో మాత్రం దేశ చరిత్రలోనే ఓ ప్రత్యేకమైన రోజు..
చాలా మంది మధ్యతరగతి ప్రజల్లో ఆశలు నింపుతూ కొత్త కారును రతన్ టాటా తీసుకొస్తున్నారని మార్కెట్లో అప్పటికే అందరికీ తెలుసు.
కానీ, ఆ కారు ఎలా ఉంటుందో అని అందరిలోనూ ఒకటే ఆసక్తి..
ఎన్నో ఆశలు, ఆకాంక్షల నడుమ ఒక చిన్న కారులో రతన్ టాటా చాలా ఉత్సాహంతో వేదికపైకి వచ్చారు.
అక్కడికి వచ్చిన వారంతా ఆ బుల్లి కారును చూసి ముచ్చటపడిపోయారు.
ఆ కారు తొలి చూపులోనే అందర్నీ ఆకట్టుకోగలిగింది. దాని పేరే “టాటా నానో”.
దీని ధర కూడా రతన్ టాటా ముందుగా చెప్పినట్లే.. లక్ష రూపాయిలు అని ప్రకటించారు.
ఈ విషయం అప్పట్లో దేశంలోనే సంచలనం.. దీనిపై మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది.
ఆ బుల్లి కారును చూసిన వెంటనే తమ ఇంట్లోకి తొలి కారుగా నానోను ఆహ్వానించేందుకు చాలా మంది బుకింగ్‌లు చేసుకున్నారు. కొంత మంది ఇంట్లో కారు ఉన్నప్పటికీ, నానోపై ఇష్టంతో బుకింగ్ చేశారు.
అయితే, బుకింగ్ నుంచి డెలివరీ మధ్యలో ఈ కారు స్వరూపమే మారిపోయింది.
రతన్ టాటా కలల ప్రాజెక్టు.. ఒకే ఒక్క వ్యక్తి వల్ల ప్రమాదంలో పడింది.
ఈ ప్రాజెక్టును ముంచేసిన ఆ ఒకే ఒక్క వ్యక్తి ఎవరో తెలుసా? మమతా బెనర్జీ..!
రతన్ టాటా “నానో” ప్రాజెక్టును ప్రకటించిన వెంటనే.. తమ రాష్ట్రంలోనే కార్ల తయారీ ప్లాంట్ పెట్టాలని పశ్చిమ బెంగాల్ లోని అప్పటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఆహ్వానించింది.
సింగూరు ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం, టాటా కంపెనీ కలిసి రైతుల నుంచి వెయ్యి ఎకరాలు సేకరించాయి.
2007 జనవరిలో, సింగూరులో 1,800 కోట్ల రూపాయిల వ్యయంతో రతన్ టాటా తొలి ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్‌కు అనుబంధంగా కార్ల ఉత్పత్తికి సంబంధించి 13 మంది స్థానిక వ్యాపారవేత్తలు సొంత ఫ్యాక్టరీలను నిర్మించారు. మరో 17 మంది ఫ్యాక్టరీలు నిర్మించడానికి ప్రణాళికలు వేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ బెంగాల్ లో సుమారు 2,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తే.. పరోక్షంగా మరో 10,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు.
అంతా సవ్యంగా అనుకున్నట్టే జరిగింది. 2008 అక్టోబర్ లో ఈ ప్లాంట్ నుంచి తొలి కారును ఉత్పత్తి చేయడానికి అంతా సిద్ధమైంది.
ఇలాంటి సమయంలో ఆనాటి ప్రతిపక్ష నాయకురాలు మమతా బెనర్జీ చేసిన పని.. పశ్చిమ బెంగాల్ ను అల్లకల్లోలం చేసింది.
సింగూరులో భూసేకరణకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. చూస్తుండగానే.. ఈ ఆందోళన.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంగా మారింది. ఆ సమయంలో టాటా ప్లాంట్, దాని అనుబంధ ఫ్యాక్టరీలు తీవ్ర సవాళ్లు ఎదుర్కొన్నాయి. క్రమంగా ఉద్యమం కాస్తా హింసాత్మకంగా మారింది. ప్లాంట్ కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టించారు. టాటా కంపెనీలపై దాడులకు తెగబడ్డారు. టాటా ఉద్యోగులు, సిబ్బందిని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు.
దీంతో పరిస్థితులు ఇలాగే కొనసాగితే సింగూరు నుంచి ప్రాజెక్ట్‌ను ఉపసంహరించుకుంటామని రతన్ టాటా కమ్యూనిస్టు ప్రభుత్వానికి తేల్చిచెప్పారు.
కానీ, ప్రభుత్వాన్ని కూడా ఆనాడు ప్రజలు లెక్క చేసే పరిస్థితి లేదు.
ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఏకంగా 34 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పరిపాలనే కొనసాగుతోంది.
దీంతో కమ్యూనిస్టు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీన్నే మమతా బెనర్జీ క్యాష్ చేస్తున్నారు.
సింగూరు భూ పోరాటాన్ని రాష్ట్రస్థాయి ఉద్యమంగా మార్చేశారు.
పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు రోజు రోజుకీ దిగజారడం మొదలయ్యాయి. తన కలల కారు మార్కెట్లోకి వచ్చే సమయంలో ఇలాంటి పరిస్థితి తలెత్తడంతో.. రతన్ టాటా జీవితంలో తొలిసారి కన్నీరు పెట్టుకున్నారని కూడా కొంత మంది చెప్తుంటారు.
తర్వాత పరిస్థితులను అర్థం చేసుకున్న రతన్ టాటా ప్రత్యామ్నాయ మార్గాలు వెతికే పనిలో పడ్డారు.
ఈ నేపథ్యంలో పంజాబ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్ వంటి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు భూములు అందించడానికి సిద్ధంగా ఉన్నామని రతన్ టాటాకు ప్రతిపాదనలు పంపించారు.
వెంటనే టాటా ఉద్యోగుల ప్రాణాలు, భద్రతను దృష్టిలో ఉంచుకుని 2008 అక్టోబర్ 3న సింగూర్ ప్లాంట్ ను మూసేస్తున్నట్లు రతన్ టాటా ప్రకటించారు. ఈ సందర్భంగా కాస్త భావోద్వేగానికి కూడా గురయ్యారు.
ఇలాంటి పరిస్థితుల్లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు.
గుజరాత్ లో టాటా ప్లాంట్ పెడితే అదనపు ప్రోత్సాహకాలు, మరిన్ని పన్ను ప్రయోజనాలు కల్పిస్తామని ప్రకటించారు.
సాణంద్ ప్రాంతంలో ప్లాంటు ఏర్పాటుకు భూమి ఇస్తామని ఆయన సీఎం నరేంద్ర మోదీ ప్రతిపాదించారు.
దీంతో రతన్ టాటా గుజరాత్ రాష్ట్రం వైపే మొగ్గు చూపించారు.
అయితే, సింగూర్ నుంచి సాణంద్‌ల మధ్య దూరం దాదాపు 2 వేల కిలో మీటర్లు..
అక్కడి నుంచి ఇక్కడకు టాటా ప్లాంటును తీసురావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దీని కోసం కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చారు.
వీటిలో మొదటిది మెషీన్లు, విడి భాగాలు, ఇతర మెటీరియల్స్.. ఇలా మొత్తం అన్నింటినీ రోడ్డు మార్గంలో సింగూర్ నుంచి సాణంద్‌కు తీసుకెళ్లాలి.
ఇక రెండోది ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్, మహారాష్ట్రలోని పుణెల్లోని ఫ్యాక్టరీల్లో నానో తయారీ మొదలయ్యేలా కొన్ని భాగాలను ముందుగా అక్కడకు పంపించడం.
మొత్తంగా 3,340 ట్రకులు, 495 కంటైనర్లలో ఏడు నెలల్లో మొత్తం ఫ్యాక్టరీని సింగూర్ నుంచి సాణంద్‌కు తరలించారు. అలా 1800 కోట్ల రూపాయిల ఫ్యాక్టరీ సాణంద్‌కు చేరింది.
సింగూరులో తయారీ ప్రక్రియలు నిలిపివేసిన 14 నెలల తర్వాత.. అంటే, 2009 నవంబరులో సాణంద్‌లో మళ్లీ నానో కారు తయారీ పనులు మొదలయ్యాయి.
దీంతో, అదే ఏడాది ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్ అవార్డును నానో గెలుచుకుంది.
మళ్లీ దేశ ప్రజల్లో ఆశలు చిగురించాయి. అసలు ఈ లక్ష రూపాయిల కారును ఎప్పుడు బుక్ చేసుకుందామా? అది ఎప్పుడు ఇంటికి వస్తుందా? అని మధ్యతరగతి ప్రజల్లో ఆసక్తిని టాటా మోటార్స్ మరింత పెంచింది.
బుకింగ్స్ విపరీతంగా పెరగడంతో లక్కీడ్రాలు తియ్యడం కూడా మొదలుపెట్టారు.
ఇక్కడే టాటా మొటార్స్ కు మళ్లీ చిక్కులు మొదలయ్యాయి.. కాదు, కాదు.. చుక్కలు కనిపించాయి..
తయారీ పూర్తయ్యి, రియాలిటీలోకి వచ్చే సరికి నానో కారును లక్ష రూపాయిలకు అందించడం సంస్థకు కష్టమైపోయింది.
ఎందుకంటే, రతన్ టాటా చేసిన ప్రకటనకు.. ఈ కారు మార్కెట్‌లోకి రావడానికి దాదాపు నాలుగైదేళ్లు సమయం పట్టింది.
సింగూరులో సరిగ్గా కారు ఉత్పత్తి అయ్యే టైంలో మమతా బెనర్జీ చేసిన ఉద్యమం వల్ల రెండేళ్లు వృథాగా పోయాయి.
ఈ మధ్యలో కారులో ఉపయోగించే విడి భాగాల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది.
మొత్తానికి టాటా నానో కారుకు ఇంకాస్త ధర పెంచి మార్కెట్లోకి విడుదల చేశారు.
కానీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది..
టాటా నానోలో చాలా లోపాలున్నాయంటూ రోజూ వార్తలు రావడం మొదలయ్యాయి. వీటిని సరిచేస్తూ వచ్చేసరికి కారు డెలివరీ కూడా ఆలస్యం అయ్యేది.
టాటా నానో మొదటి మోడల్‌లో వెనుక ట్రంక్ లేదు. ఇంజిన్ కూడా పెద్ద శబ్దం చేసేది. కారు లోపల ప్లాస్టిక్స్ కూడా తేలిగ్గా పాడయ్యేవి.. ఇలా వార్తలు వచ్చాయి.
2014లో కార్ల సేఫ్టీకి రేటింగ్ ఇచ్చే గ్లోబల్ ఎన్‌సీఏ ఏకంగా నానోకు జీరో రేటింగ్ ఇచ్చింది. ఇది నానోపై చావు దెబ్బకొట్టిందని చెప్పాలి. ఆ జీరో రేటింగ్ తర్వాత చాలా మంది కారు బుకింగ్‌లను రద్దు చేసుకున్నారు.
సామాన్యులకు అందుబాటు ధరలో కారు అనే నినాదం కాస్తా.. చీప్ కారు అనే ఇమేజ్‌లోకి ప్రజల్లోకి వెళ్లిపోయింది.
కారు అనేది భారత సమాజంలో కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాక.. హోదాకు చిహ్నంగా కూడా ఉన్న దశలో ఈ చీప్ కారు అనే ఇమేజ్ వల్ల టాటా నానోని ప్రజలు ఆదరించలేదు.
అదే సమయంలో మార్కెట్‌లో తమ బ్రాండ్‌ను కాపాడుకోవడానికి నానో ట్విస్ట్, జెన్-ఎక్స్ నానో లాంటి కార్లను టాటా తీసుకొచ్చింది. వీటిలో ఏఎంటీ గేర్‌బాక్స్ టెక్నాలజీ లాంటివి అదనంగా చేర్చారు. మరోవైపు సీఎన్‌జీతో నడిచే కార్లను కూడా ప్రవేశపెట్టారు. ఏంచేసినా మార్కెట్‌లో నానో కొనుగోళ్లు మాత్రం పెరగలేదు.
మొత్తానికి నానో ప్రయోగం విఫలమైందని ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటా కూడా అంగీకరించారు. “మేం చవకైన ధరకు మాత్రమే కారును తీసుకురావాలని అనుకోలేదు. అందరూ మెచ్చే, అందుబాటులో ఉండే కారును మేం తీసుకురావాలని అనుకున్నాం” అని ఆయన చెప్పారు.
2019లో దాదాపుగా టాటా నానోకు తెరపడింది. మొత్తంగా పదేళ్లలో మూడు లక్షల నానో కార్లు అమ్ముడుపోయాయి.
అయితే, ఇప్పుడు మళ్లీ ఎలక్ట్రిక్ నానోను తీసుకురాబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, వీటిని టాటా గ్రూప్ ఖండించడంలేదు. మరోవైపు ధ్రువీకరించడంలేదు కూడా!
ఒక దిగ్గజ వ్యాపారవేత్త మన దేశ మధ్య తరగతి ప్రజల కలలు తీర్చడం కోసం ఆలోచిస్తే.. రాజకీయ నాయకులు ఆ కలలను ఛిన్నాభిన్నం చేశారు. ఒకవేళ టాటా నానో ప్రాజెక్టును మమతా బెనర్జీ ఆరోజు అడ్డుకోకపోయి ఉంటే.. ఆరోజు ఉన్న ధరలను బట్టి కనీసం రెండు, మూడేళ్ల పాటు లక్ష రూపాయిలకే మంచి క్వాలిటీ కారు దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చేది. ఆనాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ.. ఆనాడు ప్రత్యామ్న మార్గం చూపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ రోజు మమతా బెనర్జీ టాటా నానోను అడ్డుకోకపోయి ఉంటే.. దేశ తలరాతే మారిపోయేదని కొంత మంది నిపుణులు చెప్తుంటారు.. మరికొంత మంది మాత్రం ప్రజల భూముల కోసం మమతా బెనర్జీ చేసిన ఉద్యమం సరైనదేనని సమర్థిస్తారు. టాటా నానోను చావు దెబ్బకొట్టి.. రతన్ టాటాని ఏడిపించిన మమతా బెనర్జీని సమర్థిస్తారా.. వ్యతిరేకిస్తారా.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.




