Great Story: తన కష్టం ఇంకెవ్వరికీ రాకూడదని.. లక్షల జీతం వదిలేసి, ట్యాక్సీ డ్రైవర్ గా..!
అది ముంబై మహానగరం, 1982 మార్చి 5వ తేదీ.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో సరోజ్ అనే మూడు నెలల గర్భిణికి భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది. నొప్పితో విలవిలలాడుతూ.. భర్త విజయ్ ఠాకూర్ ను నిద్రలేపింది. కడుపునొప్పితో తల్లడిల్లిపోతున్న భార్యను చూసి విజయ్ వణికిపోయాడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే ఏదైనా వాహనం కావాలి! వెంటనే రోడ్డుపైకి పరిగెత్తాడు. రోడ్డుపైన వెళ్తున్న ప్రతి వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. నా భార్యను కాపాడండి అని, గట్టిగా కేకలు వేస్తూ.. ఎంతో మందిని వేడుకున్నాడు. కానీ, అర్ధరాత్రి 2 గంటలు కావడంతో ఎవరూ బండి ఆపకుండా వెళ్లిపోతున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ.. విజయ్ లో టెన్షన్ పెరిగిపోతోంది. చివరికి, అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఆందేరి రైల్వే స్టేషన్ వరకు పరిగెత్తాడు. రెండు రెట్లు అదనంగా 300 రూపాయిలు చెల్లించి టాక్సీని తీసుకువచ్చి సరోజ్‌ను నానావటి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ, అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. దురదృష్టవశాత్తూ, సరోజ్ కు గర్భస్రావం అయ్యింది. బిడ్డ కోసం ఎంతో ఆశపడ్డ విజయ్, సరోజ్.. ఆ బిడ్డ ఇక పుట్టదని తెలిశాక వారి ప్రాణాలు విలవిలలాడాయి.
“నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి కారణం ఏంటి?!” అని విజయ్ ఠాకూర్ ఆలోచనలో పడ్డాడు.
వాస్తవానికి విజయ్ అప్పటికి బాగానే సంపాదిస్తున్నాడు. ముంబైలోని లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. జీతం బాగానే వచ్చేది! అతని జీవితంలోకి భార్య సరోజ్ రావడంతో తన లైఫ్ స్టైల్ మరింత మెరుగ్గా మారింది. పెళ్లయిన కొద్ది కాలంలోనే వారు తల్లిదండ్రులు కాబోతున్నారని తెలిసింది. దీంతో విజయ్, సరోజ్ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
కానీ, ఇంతలోనే విధి వెక్కిరించింది. అర్ధరాత్రి వేళ సరోజ్ కు విపరీతమైన కడుపునొప్పి రాగా.. సమయానికి వాహనం అందుబాటులో లేకపోవడంతో వాళ్లు తమ తొలి బిడ్డను పోగొట్టుకున్నారు. ఈ ఘటన విజయ్‌ను పూర్తిగా కలచివేసింది. ట్యాక్సీ డ్రైవర్లు సమయానికి రాకపోవడం వల్లే కదా నేను నా బిడ్డను కోల్పోయింది అనే వేదన విజయ్ ను వెంటాడేది!
“నేను బాగా సంపాదించేవాడిని కాబట్టి, రెండు రెట్లు ఎక్కువ డబ్బులు ఇచ్చి అయినా టాక్సీ తీసుకురాగలిగాను. కానీ పేద, మధ్య తరగతి వాళ్లు ఏం చేస్తారు?.. వాళ్లు కనీసం ఆటో రిక్షాని కూడా తెచ్చుకోలేరు కదా..” అని విజయ్ ఆలోచిస్తూ ఉండేవాడు. 1982లో ట్యాక్సీ డ్రైవర్ కి విజయ్ ఇచ్చిన 300 రూపాయిలను.. ఇప్పటి లెక్కల్లో చూస్తే 3 వేల రూపాయిలకు పైగా ఉంటుంది. అందుకే తన లాంటి పరిస్థితి ఏ ఒక్కరికీ రాకూడదని విజయ్ గట్టిగా నిర్ణయించుకున్నాడు.
తన భార్య మాదిరిగా అర్ధరాత్రి వేళల్లో ఇబ్బంది పడే రోగులకు సాయం చేయాలని భావించేవాడు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకు తన వంతు సాయం చేయాలని అనుకునే వాడు. కానీ, విజయ్ కి ఆఫీసు పనుల్లో కొంచెం కూడా తీరిక ఉండేది కాదు. ఒక్కోసారి గంటల తరబడి సుదీర్ఘంగా పని చేయాల్సి వచ్చేది. దీంతో రోగులకు సేవ చేయాలనే తన కోరిక తీరేది కాదు. ఓ వైపు కెరీర్.. మరోవైపు సేవ చేయాలనే పట్టుదల.. ఈ రెండింటి మధ్య నలిగిపోయే వాడు.
ఈ క్రమంలోనే 1984లో లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ వాలంటరీ రిటైర్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. మరో క్షణం ఆలోచించకుండా వెంటనే విజయ్ ఆ ఆప్షన్ ని ఎంచుకున్నాడు. 33 సంవత్సరాల వయసుకే బంగారం లాంటి మెకానికల్ ఇంజినీర్ ఉద్యోగం వదిలిపెట్టాడు. ఆ రోజున విజయ్ తన ఉద్యోగానికి రిటైర్మెంట్ ఇవ్వకపోతే.. తన జీతం లక్షల్లో.. లైఫ్ స్టైలే ఓ రేంజ్ లో ఉండేది!
కానీ, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వచ్చిన డబ్బులో 66 వేల రూపాయిలు పెట్టి ఫియాట్ కారు కొన్నాడు. తర్వాత టాక్సీ డ్రైవర్ లైసెన్స్ పొందాడు.
“నా లాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.. సరైన సమయంలో వైద్యం అందక, నా భార్య కడుపులోని బిడ్డ మాదిరిగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదు.” అనే ఏకైక లక్ష్యంతో 33 ఏళ్ల విజయ్.. మెకానికల్ ఇంజినీర్ నుంచి టాక్సీ డ్రైవర్ గా మారిపోయాడు.
విజయ్ ట్యాక్సీ డ్రైవర్ గా మారిన తర్వాత తను పెట్టుకున్న ఒకే ఒక్క నియమం.. ఏ ఒక్క ప్యాసింజర్ కూ సర్వీస్ ను నిరాకరించకూడదు.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి!!
అప్పటి నుంచి ఇప్పటి వరకు రాత్రి, పగలు తేడా లేకుండా అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ విజయ్ సాయం చేస్తున్నాడు. ముఖ్యంగా డబ్బు విషయంలో ఏ ఒక్కరినీ.. ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు. సమయం, సందర్భాన్ని బట్టి.. బాధిత వ్యక్తి సామర్థ్యాన్ని బట్టి ట్యాక్సీ ఛార్జి తీసుకునే వాడు.
ముఖ్యంగా అర్ధరాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు ఏ రోజూ విజయ్ ఠాకూర్ నిద్రపోలేదు. ఎందుకంటే, అది మనిషి బాగా నిద్రపోయే పీక్ సమయం! ఆ టైంలో ట్యాక్సీ డ్రైవర్లు అందుబాటులో ఉండే అవకాశం చాలా తక్కువ! ఎవరైనా ఎమర్జెన్సీగా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తే.. వారికి సాయం చేయడానికి ఎవరో ఒకరు అందుబాటులో ఉండాలి. తన మొదటి సంతానాన్ని కోల్పోయింది కూడా ఈ టైంలోనే! అందుకే.. గత 40 ఏళ్లుగా అర్ధరాత్రి 2 గంటల నుంచి 4 గంటల మధ్య విజయ్ అసలు నిద్రపోయిందే లేదు. ఈ విషయంలో భార్య, కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా.. విజయ్ తన పని తాను చేస్తూనే ముందుకుపోతున్నాడు.
అవసరాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి తన కెరీర్ నే త్యాగం చేసిన విజయ్ ఠాకూర్ ని.. 1999లో మరోసారి దురదృష్టం వెంటాడింది. విజయ్, సరోజ్ దంపతుల చిన్న కుమారుడు క్రికెట్ ఆడుతుండగా మోకాలికి బంతి తగలడంతో గాయమైంది. మొదట్లో చిన్న గాయమే కదా అనుకొని విజయ్, సరోజ్ లు పెద్దగా పట్టించుకోలేదు. కానీ గాయం తగిలిన వారానికి మోకాలి దగ్గర భయంకరంగా వాచిపోయింది. వెంటనే డాక్టర్‌ను సంప్రదించగా గాయం తగిలిన చోట క్యాన్సర్ గా మారిందని నిర్ధారించారు. ఈ విషయం తెలిసిన 16 రోజుల్లోనే.. 19 ఏళ్ల కుమారుడు ప్రాణం కోల్పోయాడు.
ఈసారి విజయ్ మరింతగా కుంగిపోయాడు. తన కుమారుడి చికిత్స కోసం తన వద్ద ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాడు.
కొడుకును పోగొట్టుకోవడంతో పాటు, సర్వం కోల్పోయినప్పటికీ.. ఒక సంఘటన మాత్రం ప్రజలకు సేవ చేయాలన్న తన లక్ష్యాన్ని మరింత పటిష్టం చేసింది.
“ఓసారి నా కుమారుడి చికిత్స కోసం 43 వేల రూపాయిలు బిల్లు చెల్లించాల్సి వచ్చింది. కానీ, నా దగ్గర 42 వేల 990 రూపాయిలు మాత్రమే ఉన్నాయి. 10 రూపాయిలు తక్కువగా ఉన్నాయని బిల్ కౌంటర్‌లో ఉన్న వ్యక్తి డబ్బు తీసుకోలేదు. కాసేపట్లో ఇస్తానని చెప్పినప్పటికీ.. రూల్స్ ఒప్పుకోవని కరాఖండిగా చెప్పేశారు. అప్పుడే ఓ అపరిచిత వ్యక్తి నాకు ఆ పది రూపాయిలు ఇచ్చాడు. అతడి సాయం వల్లే నేను ఆస్పత్రి బిల్లు చెల్లించగలిగాను. ఈ సంఘటన నాకు మరింత శక్తి ఇచ్చింది.” అని విజయ్ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.
ఈ సంఘటన తర్వాత, విజయ్ పేద పేషెంట్ల నుంచి ఎలాంటి డబ్బు తీసుకునే వాడు కాదు. ఈ మేరకు తన టాక్సీ వెనుక భాగంలో ఒక బోర్డు కూడా పెట్టాడు. ముంబైలో ఆస్పత్రికి వెళ్లాలని ఎవరు.. ఏ క్షణంలో ఫోన్ చేసినా సరే.. విజయ్ ఏనాడూ ‘నో’ అని చెప్పలేదు. ముంబై ప్రజల కోసం అంతటి గొప్ప సర్వీస్ చేశారు.
విజయ్ కు తన 40 ఏళ్ల ట్యాక్సీ డ్రైవర్ జీవితంలో గుర్తుండిపోయే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ, ఒక్క సంఘటన మాత్రం తనకు అత్యంత సంతృప్తినిచ్చింది.
20 ఏళ్ల క్రితం.. 2004 డిసెంబర్ 31 అర్ధరాత్రి 3 గంటల సమయంలో విజయ్ ట్యాక్సీలో వెళ్తున్నాడు. రోడ్డు పక్కన ఓ నిర్మాణుష్య ప్రదేశంలో ఒక కారు ట్యాంకర్‌కి ఢీకొట్టింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. విజయ్ వెంటనే ట్యాక్సీ దిగి చూడగా.. ఆ కారులో భార్యా, భర్త.. 8 నెలల పాప ఉన్నారు. విజయ్ వెంటనే వారిని దగ్గర్లో ఉన్న కూపర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ, అప్పటికే దురదృష్టవశాత్తూ తల్లి మరణించింది. కానీ, ఆస్పత్రికి సకాలంలో తీసుకురావడం వల్ల తండ్రి, పాప ప్రాణాలతో బయటపడ్డారు.
అయితే.. చనిపోయిన ఆ మహిళ 2 లక్షల రూపాయిల విలువైన ఆభరణాలు ధరించి ఉంది. డాక్టర్లు ఆ నగలు తీసి.. విజయ్ చేతికి ఇచ్చారు. కానీ, ఆస్పత్రికి బాధితుల బంధువులు రాగానే ఆ నగలన్నీ వారి చేతికి ఇచ్చి.. అక్కడి నుంచి విజయ్ వెళ్లిపోయాడు.
ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకు గానీ తెలియలేదు.. ఆరోజు తను కాపాడింది ఎవరినో..!
ఓ రోజు ఉదయాన్నే రమేష్ ఇంటికి ఒక డ్రైవర్ వచ్చాడు.. మా అయ్య గారు మిమ్మల్ని తీసుకొని రమ్మని చెప్పారని విజయ్ తో అన్నాడు. “ఎవరు మీ అయ్య గారు.. నన్నెందుకు రమ్మంటున్నాడు” అని విజయ్ అడిగాడు. “అవన్నీ నాకు తెలియదు.. ఆయనకు ఒంటి నిండా గాయాలతో మీ దగ్గరకు రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకే మిమ్మల్ని రావాలని కోరాడు.” అని ఆ డ్రైవర్ చెప్పాడు. దీంతో ఎవరో పేషెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లమని పిలుస్తున్నాడేమో అనుకొని విజయ్ బయల్దేరాడు.
విజయ్ ను ఆ డ్రైవర్ ఓ భారీ భవంతిలోకి తీసుకెళ్లాడు. విజయ్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు.. ఇంతలో విజయ్ లోపలికి వెళ్లగానే, తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తి పైకి లేవడానికి ప్రయత్నిస్తూ.. నమస్కారం పెట్టాడు. విజయ్ కు అప్పుడు అర్థమైంది.. ఆ రోజు రాత్రి రోడ్డు ప్రమాదంలో కాపాడిన వ్యక్తి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సుధాకర్ బొకాడె అని..! నీ వల్లే నేను, నా కూతురు ప్రాణాలతో ఉన్నామంటూ సుధాకర్ బొకాడె భావోద్వేగం చెందాడు. నాలుగైదు డబ్బు నోటు కట్టలు తీసి.. విజయ్ కి ఇవ్వబోయాడు! కానీ, విజయ్ మాత్రం సుధాకర్ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడు. ఇంకేమైనా కావాలంటే చెప్పు అని అడగ్గా.. నాకేం వద్దు సార్ అని చెప్పి విజయ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
“నేను ఈ పని డబ్బు కోసమో లేదా పబ్లిసిటీ కోసమో చేయడం లేదు. ఒక వ్యక్తికి సాయం చేశాక, తను బాగున్నాడని తెలిస్తే చాలు.. వాళ్ళను మర్చిపోతాను.” అని విజయ్ చెప్తుంటాడు.
విజయ్ తన జీవితంలో 500 మందికి పైగా పేషెంట్లకు సకాలంలో సాయం చేసి వారి ప్రాణాలను కాపాడారు. అలాగే, డబ్బు కోసం ఇబ్బంది పెట్టకుండా లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చాడు.
విజయ్ ఠాకూర్ చేస్తున్న ఈ గొప్ప పని ఓ రోజు మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసింది. దీంతో ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. తన ‘ఆజ్ కి రాత్ హై జిందగీ’ షోకి విజయ్ ఠాకూర్‌ను ఆహ్వానించి సత్కరించారు.
ఈ సందర్భంగా విజయ్ కి అమితాబ్ సడన్ సర్ ప్రైజ్ కూడా ఇచ్చాడు. ఆ షోలోనే విజయ్ ఠాకూర్ కు.. తన ఆరాధ్య హీరో జితేంద్రను కలుసుకునే అవకాశం కల్పించాడు.
“అది నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. జితూ సార్‌ను కలుస్తానని జీవితంలో అస్సలు ఊహించలేదు. స్కూల్ ఎగ్గొట్టి మరీ ఆయన సినిమాలు చూసేవాడిని ఫర్ఝ్ సినిమా 31 సార్లు చూశాను,” అని విజయ్ సంతోషంగా చెబుతాడు.
ఆదర్శవంతమైన జీవితం గడిపిన విజయ్ ఠాకూర్.. ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. విజయ్ కి ప్రస్తుతం 73 సంవత్సరాలు! ఈ వయసులో ఆయన సర్వైకల్ స్పాండిలైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు.
“ఈ వ్యాధి వచ్చిన వారికి తక్షణమే ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు. ఈ ఆపరేషన్ తర్వాత నేను చనిపోవచ్చు.. లేదా పక్షవాతంతో మంచానపడొచ్చని కూడా వివరించారు. కానీ, నాకు ఎంతో మంది ప్రజల ఆశీస్సులు ఉన్నాయి.. నాకేమీ కాలేదని నమ్ముతున్నారు. ప్రజల దీవెనలను నేను విశ్వసిస్తున్నాను.” అని విజయ్ ఠాకూర్ చెబుతున్నాడు.
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో మంది ప్రాణాలు కాపాడి, ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపిన విజయ్ ఠాకూర్ ప్రస్తుతం ప్రాణాంతకర వ్యాధితో బాధపడుతున్నారు.. అయినప్పటికీ తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులను ఇంకెవరూ అనుభవించకూడదని ఇప్పటికీ ట్యాక్సీ నడుపుతూ ఎంతో మంది ప్రాణాలు నిలుపుతున్నారు. విజయ్ ఠాకూర్ చేస్తున్న గొప్ప పని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.




