కోల్ కత్తా డాక్టర్ కేసులో ఏం జరిగింది? సంజయ్ రాయ్ గురించి సంచలన నిజాలు!
ఆ అమ్మాయి పేరు అభయ.. చాలా నిరుపేద కుటుంబం.. కానీ, ఎలాగైనా గొప్ప చదువులు చదవాలనే బలమైన కోరిక. చిన్నప్పటి నుంచి వైద్య వృత్తి అంటే ఎనలేని గౌరవం. డాక్టర్ అయితే ఎంతో మంది పేదవారికి సాయం చేయవచ్చని తల్లిదండ్రులకు ఎప్పుడూ చెప్తుండేది. ఎలాగైనా డాక్టర్ కావాలని తపనపడేది! చదువే లోకంగా బతికింది. తమ మాదిరిగా కష్టపడకూడదని ఆ తల్లిదండ్రులు పస్తులుండి మరీ కూతుర్ని చదివించారు. తల్లిదండ్రుల త్యాగం, కూతురు కష్టం వృథా కాలేదు. ఆ అమ్మాయి మెరిట్ లో ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఎన్నో ఆర్థిక కష్టాలు, చెప్పుకోలేని బాధలు అనుభవించి ఎంబీబీఎస్ పూర్తి చేసింది.
ఆ సమయంలోనే అభయకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తర్వాత వారి పరిచయం కాస్తా, స్నేహంగా మారి.. అనంతరం ప్రేమగా రూపాంతరం చెందింది. ఇద్దరూ డాక్టర్లు అయిన తర్వాత.. తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పారు. తర్వాత రెండు కుటుంబాలు కలుసుకొని మాట్లాడుకున్నాయి. ఇద్దరికీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ముందుగా నిశ్చితార్థం చేసి.. 2024 నవంబర్‌లోనే పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు.
తర్వాత అభయ కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో చేరింది. కూతురు ట్రైనీ డాక్టర్ గా చేరడంతో ఆర్థిక కష్టాలు కాస్త తీరినట్లే అని ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. వైద్య వృత్తిపై ఎంతో ప్యాషన్ తో వచ్చిన ఆ అమ్మాయి రేయింబవళ్లు కష్టపడి పని చేసేది.
ఆగస్టు 8వ తేదీన అభయకు నైట్ డ్యూటీ! రాత్రి విధుల్లోకి వచ్చిన ఆమె.. స్నేహితులతో కలిసి ఒలింపిక్స్ పోటీలను వీక్షించింది. ఆరోజే ఒలిపింక్స్ లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్! నీరజ్ చోప్రా ఎలాగైనా ఇండియాకి మరో గోల్డ్ మెడల్ సాధిస్తాడని ఫ్రెండ్స్ తో చెప్పింది. కానీ, నీరజ్ రజత పతకం సాధించాడు. కాస్త డిసప్పాయింట్ అయినా.. ఇండియాకి ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ వచ్చిందని ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత తన తోటి సిబ్బందితో కలిసి డిన్నర్ చేసింది. అనంతరం తల్లికి ఫోన్ చేసి మాట్లాడింది. ఆ తర్వాత, కాబోయే భర్తతో కూడా చాలా సేపు మాట్లాడింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఎమర్జెన్సీ బ్లాక్‌లోని సెమినార్ హాల్‌ల్లోకి విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లింది.
ఆగస్టు 9, శుక్రవారం ఉదయం ఆస్పత్రి సిబ్బంది సెమినార్ హాల్‌లోకి వెళ్లి చూసి.. దిగ్భ్రాంతికి గురయ్యారు. కొన్ని గంటల ముందే ఎంతో సరదగా గడిపిన ఆ అమ్మాయి.. అర్ధనగ్నంగా సెమినార్ హాల్‌లో శవమై పడి ఉంది. శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. కళ్లు, నోటి నుంచి రక్తం కారుతూ కనిపించింది. వెంటనే సిబ్బంది ఆస్పత్రి యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించారు.
కానీ, ఆస్పత్రి సిబ్బంది మాత్రం.. మీ కూతురికి ఆరోగ్యం బాగలేదని ఉదయం 10:53 గంటలకు ఫోన్ చేసి కాల్ కట్ చేశారు. తర్వాత తల్లిదండ్రులు ఫోన్ చేసి ఏం జరిగిందో చెప్పాలని ప్రశ్నిస్తే.. ఆసుపత్రికి రావాలన్నారు. దీంతో కాబోయే అల్లుడితో కలిసి అభయ తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఓ అసిస్టెంట్ మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పింది.. తల్లిదండ్రులు అక్కడే కుప్పకూలిపోయారు. కూతుర్ని చూసేందుకు వెళ్లగా.. వారిని హాలులోకి వెళ్లేందుకు అనుమతించలేదు. తీరా మధ్యాహ్నం 3 గంటలకు లోపలికి పంపించారు.
తల్లిదండ్రులు తమ కుమార్తెను చూసి గుండెలవిసేలా రోదించారు. ఆమె శరీరంపై కేవలం ఒక్క చిన్న వస్త్రం మాత్రమే ఉంది. చేతులు విరిగిపోయి ఉన్నాయి. కళ్లు, నోటి నుంచి రక్తం వస్తోంది. వెంటనే.. నా కూతుర్ని ముమ్మాటికీ ఎవరో హత్య చేశారు.. ఇది ఆత్మహత్య కానే కాదు అని తల్లి బిగ్గరగా అరిచి చెప్పింది.
అప్పటికి.. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు “అనుమానస్పద మృతి”గా కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలు తీవ్ర గాయాలతో అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా కనిపించినా.. ఆమెది అసహజ మరణం అని రికార్డుల్లో ఆలస్యంగా నమోదుచేశారు. అంతేగాక.. కేసు నమోదుకు ముందే పోస్ట్‌మార్టం నిర్వహించారు.
పోస్ట్‌మార్టంలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ప్రైవేటు పార్ట్స్ తో పాటు కళ్లు, నోటి నుంచి బ్లీడింగ్ అయిందని.. ముఖం, గోళ్లపై గాయాలతో పాటు కడుపు, ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులు, చేతి వేళ్లపై గాయాలు ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. ఆమె శరీరంపై 14 చోట్ల గాయాలున్నాయని తేలింది. ఊపిరితిత్తుల్లో అధిక మొత్తం రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. అత్యంత పాశవికంగా ఆమెపై దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడినట్లు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. బలవంతంగా లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని, దీని కారణంగా ఆమె వ్యక్తిగత అవయవాల వద్ద లోతైన గాయం జరిగినట్లు ఆ నివేదికలో ఉంది.
అత్యాచార సమయంలో బాధితురాలు నిందితుడితో శక్తి మేరకు పోరాడి ఉంటుందని వైద్యులు పోస్ట్‌మార్టం నివేదికలో పేర్కొన్నారు. ఆమె గోళ్లలో నిందితుడి చర్మం, రక్త నమూనాలు ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో నిందితుడు ఈ దాడికి పాల్పడి ఉంటాడని ఆ నివేదికలో వెల్లడించారు.
పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన బాధిత తల్లిదండ్రులు, అక్కడున్న విద్యార్థుల గుండెలు ముక్కలయ్యాయి. ఒకవైపు పోలీసుల నిర్లక్ష్యం, మరోవైపు ఆస్పత్రి యాజమాన్యం బాధ్యతారాహిత్యం చూసిన బాధితులు న్యాయం కోసం రోడ్లెక్కారు. ఇంతలోనే హత్యాచారానికి గురైన యువతి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గంటల్లోనే ఇది దేశవ్యాప్తంగా దావానంలా పాకింది. దేశం భగ్గుమంది. బాధితురాలికి న్యాయం చేయాల్సిందే అని దేశ ప్రజలు ముక్త కంఠంతో నినదించారు. చూస్తుండగానే దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. పరిస్థితులు చేజారిపోవడంతో రాష్ట్ర పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ ని నిందితుడిగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటడంతో కోల్ కతా హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. రాష్ట్ర పోలీసుల విచారణ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసును కోల్‌కత్తా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేసింది. వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ.. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను విచారణకు పిలిచింది. నాలుగు రోజులుగా ఆయనను ఏకంగా 53 గంటల పాటు విచారించింది. అలాగే, సంజయ్ రాయ్ ని విచారించగా.. దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి.
సంజయ్ రాయ్‌కు ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు జరిగినట్టు తెలిసింది. అతడి అనుచిత ప్రవర్తనకు విసిగివేసారి ముగ్గురు వదిలి వెళ్లిపోగా.. ఒక భార్య గతేడాది క్యాన్సర్‌తో మృతిచెందింది. ప్రతిరోజూ మద్యం తాగి అర్ధరాత్రి వేళల్లో ఇంటికి వస్తుంటాడని స్థానికులు చెప్పారు.
ఇంతటి ఘన కీర్తి ఉన్న సంజయ్ రాయ్.. స్థానిక పోలీస్ విభాగంలో విపత్తుల నిర్వహణ బృందంలో వాలంటీర్‌గా చేరాడు. అప్పటి నుంచి ఓ పోలీసు ఉన్నతాధికారికి పీఏగా పని చేస్తున్నానంటూ చెలామణి అయ్యేవాడు. కొందరికి మాత్రం హోంగార్డుగా పరిచయం చేసుకునేవాడు. నగరంలోని ఓ పోలీసు బెటాలియన్ వద్ద ఎక్కువగా కనిపించేవాడు. ఈ క్రమంలోనే ఆర్జీ కర్ ఆసుపత్రి చెక్‌పోస్టు వద్ద సంజయ్ కి బాధ్యతలు అప్పగించారు. దీంతో పోలీసుల అండ చూసుకుని సంజయ్ రాయ్ పోకిరి చేష్టలతో స్థానికులను ఎప్పుడూ ఇబ్బంది కలిగించేవాడని తెలిసింది.
ఇక విచారణలో భాగంగా, సంజయ్ మొబైల్ ఓపెన్ చేసి చూసిన పోలీసులు షాక్ కు గురయ్యారు. అతడి మొబైల్‌లో వందలాది మహిళల అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు గుర్తించారు. దీంతో అతడు అశ్లీలతకు బానిసై ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధరించారు. అంతేకాకుండా మహిళా సహోద్యోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లు తేలింది. ఈ విషయాలన్నీ నిజమేనని దర్యాప్తు అధికారుల ముందు సంజయ్ అంగీకరించాడట.
ఇక, ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం జరిగిన రోజు రాత్రి 11 గంటల సమయంలో సంజయ్ రాయ్ ఆర్‌జీ కార్ ఆస్పత్రి వెనక వైపున ఫూటుగా మద్యం తాగినట్లు పలువురు పేర్కొన్నారు. ఆ సమయంలో పోర్న్ వీడియోలు చూసినట్లు చెప్పారు. మద్యం తాగాక పలుమార్లు ఆస్పత్రి ప్రాంగణంలో చక్కర్లు కొట్టినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. తర్వాత, సంజయ్ రాయ్ కోల్‌కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు కోల్‌కతా పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రికే చెందిన మరో సివిక్ వాలంటీర్‌తో కలిసి కోల్‌కతాలోని “రెడ్ లైట్ ఏరియా”లకు వెళ్లాడు.
సంజయ్, అతడి స్నేహితుడు కలిసి ఓ ద్విచక్రవాహనాన్ని అద్దెకు తీసుకొని, తొలుత సోనాగచికి వెళ్లారు. అక్కడ రాయ్ వ్యభిచార గృహం బయట నిలుచోగా, అతడి మిత్రుడు లోపలికి వెళ్లాడు. అనంతరం అర్ధరాత్రి 2 గంటల సమయంలో దక్షిణ కోల్‌కతాలోని మరో వ్యభిచార గృహానికి వెళ్లారు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను రాయ్ వేధింపులకు గురిచేశాడు. మద్యం మత్తులో ఉన్న అతడు.. ఆమె నగ్న చిత్రాలు కావాలని అడిగాడు. ఉదయం 3.50 గంటల సమయంలో రాయ్ ఆర్‌జీ కార్ ఆస్పత్రికి చేరుకున్నాడు. తొలుత ఆపరేషన్ థియేటర్ డోర్‌ను పగలగొట్టిన నిందితుడు.. 4.03 గంటల సమయంలో అత్యవసర విభాగంలోకి ప్రవేశించాడు. అనంతరం మూడో అంతస్తులో ఉన్న సెమినార్ గదిలోకి వెళ్లాడు. విశ్రాంతి తీసుకునేందుకు అభయ ఆ సెమినార్ గదిలోకే వెళ్లింది.. తెల్లవారాక సిబ్బంది చూడగానే ఆ ట్రైనీ డాక్టర్ అత్యంత పాశవికంగా హత్యాచారానికి గురై పడి ఉంది.
ట్రైనీ డాక్టర్ హత్యాచార ఉదంతం దావానంలా పాకి, దేశం అట్టుడుకుతున్న పరిస్థితుల్లో సంజయ్ రాయ్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పోలీసులు విస్తుపోయే సంచలన విషయాలను వెల్లడించారు. సంజయ్ రాయ్.. వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడి, తర్వాత హత్య చేసిన అనంతరం తాను ఉండే ప్రాంతానికి తిరిగొచ్చి హాయిగా నిద్రపోయినట్లు పోలీసులు తెలిపారు. ఉదయాన్నే సాక్ష్యాలను చెరిపివేయడానికి తన దుస్తులపై ఉన్న రక్తపు మరకలను తుడిచిపెట్టేందుకు ఉతుక్కున్నాడని చెప్పారు. అయితే.. అతడి బూట్లపై ఉన్న రక్తపు మరకల ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు తెలిపారు.
అలాగే, సీబీఐ విచారణలో అతడు నేరం అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి చెందిన వైద్యబృందం నిందితుడి మానసిక తీరును విశ్లేషించింది. ఆ రోజు రాత్రి జరిగిన ప్రతీ నిమిషం క్రైం సీన్ ను నిందితుడు గుక్కతిప్పకుండా వివరించాడని, అతడిలో పశ్చాత్తాపమే లేనట్లు కనిపించిందని ఓ సీబీఐ అధికారి చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి.
ఇంతలోనే సంజయ్ రాయ్ యావత్ దేశానికి ట్విస్ట్ ఇచ్చాడు.
అభయ హత్యాచార కేసులో సంజయ్‌రాయ్‌ను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. అంతే.. జడ్జి ముందు సంజయ్ భోరున ఏడవడం మొదలు పెట్టాడు. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని వాపోయాడు. ” నేను అమాయకుడిని.. ఏ తప్పు చేయలేదు.. నన్ను ఇందులో కుట్రపూరితంగా ఇరికించారు. కావాలంటే పాలీగ్రాఫ్ టెస్ట్ చేయండి.. ఈ పరీక్షతో అసలు విషయం బయటపడుతుంది” అని సంజయ్ రాయ్ చెప్పాడు. దీంతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది.
దర్యాప్తు బృందం పక్కా ఆధారాలు చూపించి నువ్వే హత్యాచారం చేశావని చెప్పగా.. ఆ సమయంలో తాను అక్కడ లేనే లేనని సంజయ్ రాయ్ చెప్పాడు. అంతేగాక, తాను సెమినార్ హాల్‌కు వెళ్లేసరికి వైద్యురాలు అప్పటికే చనిపోయి ఉందని, దీంతో భయంతో అక్కడి నుంచి తాను పారిపోయానని సంజయ్ చెప్పినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. దీంతో ఈ కేసు ఎటు వెళ్తుందోనన్న అనుమానాలు చెలరేగాయి.
ఇదే సమయంలో ఆర్.జి.కార్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వైద్యురాలి మరణం విషయం తెలిసిన వెంటనే ఆయన పోషించిన పాత్ర అనుమానాస్పదంగా ఉంది. ఈ క్రమంలోనే సందీప్ ఘోష్‌తో పాటు ఈ కేసును తొలుత దర్యాప్తు చేసిన తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అభిజిత్ మండల్ ను సీబీఐ అరెస్టు చేసింది. దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించడం, సాక్ష్యాధారాలను దాచేందుకు యత్నించారన్న ఆరోపణలపై వారిని అరెస్టు చేశారు. సందీప్ ఘోష్‌పై అత్యాచారం, హత్య అభియోగాలను కూడా చేర్చారు. దీంతో ఈ కేసు సంచలన మలుపు తిరిగినట్లయింది.
దీంతో అభయపై హత్యాచారం చేసింది ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ నా లేదా సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ నా అనే ప్రశ్నలు చుట్టుముట్టాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎన్నో చిక్కుముడులు కనిపించాయి.
ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం డాక్టర్ అభయ హత్యాచార కేసులో కోర్టులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. డీఎన్ఏ, రక్తపు నమూనాలు సహా 11 రుజువులను అందులో ప్రస్తావించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సివిక్ వాలంటీర్ సంజయ్‌రాయ్‌కు సంబంధించిన డీఎన్ఏ.. అభయ శరీరంపై లభ్యమైనట్లు సీబీఐ వెల్లడించింది. సంఘటనా స్థలంలో లభ్యమైన వెంట్రుకలు, బ్లూటూత్ ఇయర్ ఫోన్ నిందితుడివేనని తెలిపింది. మృతురాలి రక్త నమూనాలు సంజయ్ రాయ్ దుస్తులు, చెప్పులపై లభ్యమైనట్లు రుజువులను అభియోగపత్రంలో పేర్కొంది.
ఆర్జీ కర్ ఆస్పత్రిలో ఆగస్టు 9న ఈ హత్యాచారం జరగగా, నిందితుడు సంజయ్‌రాయ్‌ను ఆగస్టు 10వ తేదీన కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 8, 9 తేదీల్లో సంజయ్‌రాయ్ ఆస్పత్రిలోనే ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా సాక్ష్యాలుగా సీబీఐ సమర్పించింది. మృతురాలి రక్త నమూనాలు నిందితుడు సంజయ్‌రాయ్ జీన్స్, చెప్పులపై లభ్యమైనట్లు తెలిపింది. నిందితుడి దుస్తులు, ఫుట్‌వేర్‌ను ఆగస్టు 12న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలిలో లభ్యమైన వెంట్రుకలు నిందితుడు సంజయ్‌రాయ్‌తో సరిపోలినట్లు సీబీఐ పేర్కొంది. అంతేకాకుండా హత్యాచార ఘటనలో బాధితురాలు ప్రతిఘటించగా నిందితుడు సంజయ్‌రాయ్‌కు కొన్ని గాయాలయ్యాయి. వాటిని కూడా రుజువులుగా ఛార్జిషీట్‌లో తెలిపింది.
ఇక సంఘటన జరిగిన ప్రదేశంలో లభ్యమైన బ్లూటూత్ ఇయర్‌ఫోన్ నిందితుడు మొబైల్ ఫోన్‌తో అనుసంధానం అవుతున్నట్లు సీబీఐ తెలిపింది. ఈ సాక్ష్యాలను సంబంధించి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ పరిశోధనశాల రిపోర్ట్స్‌ను అభియోగపత్రంలో పేర్కొంది. ఆగస్టు 8, 9వ తేదీల్లో సంజయ్‌రాయ్ ఆస్పత్రిలో తిరుగుతూ ఉన్నప్పుడు బ్లూటూత్ ఇయర్‌ఫోన్ నెక్‌బ్యాండ్‌తో అతను కనిపించినట్లు వివరించింది. అయితే, హత్యాచార ఘటన జరిగిన తర్వాత లిఫ్ట్ వద్దకు సంజయ్‌రాయ్ వెళ్లినప్పుడు అతని వద్ద బ్లూటూత్ ఇయర్‌ఫోన్ మిస్సైనట్లు పేర్కొంది.
గొంతు నులమడం, ఉక్కిరిబిక్కిరి చేయడమే వైద్యురాలు మృతికి కారణమని సీబీఐ ఛార్జీషీట్లో తెలిపింది. వైద్యురాలి మృతదేహానికి శవపరీక్ష నిర్వహించే సమయంలో ఆమె శరీరమంతా రిగర్ మోర్టిస్ ఉందని, పోస్ట్‌మార్టం జరగడానికి 12 నుంచి 18 గంటల ముందు ఆమె మరణించినట్లు అది సూచిస్తుందని వెల్లడించింది. మృతిరాలిపై బలవంతపు లైంగిక చర్య జరిగినట్లు లభ్యమైన ఆధారాలను కూడా అభియోగపత్రంలో పొందుపర్చింది. వైద్యురాలి శరీరంపై లభ్యమైన లాలాజలం సంజయ్‌రాయ్‌దే అని డీఎన్ఏ నివేదికలో తేలినట్లు తెలిపింది.
గత రెండు నెలలుగా ఎన్నో మలుపులు తిరిగిన అభయ హత్యాచార కేసు.. సీబీఐ ఛార్జ్ షీట్ తో ఓ కొలిక్కి వచ్చినట్లయింది. అభయపై దారుణానికి ఒడిగట్టిన ఆ నీచుడు సంజయ్ రాయే అని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అభయపై అత్యంత పాశవికంగా దారుణానికి ఒడిట్టిన సంజయ్ రాయ్ కి ఎలా శిక్ష పడాలని అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే, ఈ కేసు విషయంలో మీకేమైనా అనుమానాలు ఉన్నా కామెంట్ చేయండి.




