SN_LogoSN_LogoSN_LogoSN_Logo
  • హోం
  • లైఫ్‌స్టైల్
  • స్పోర్ట్స్
  • న్యూస్
✕
  • Home
  • Blog
  • News
  • ప్రపంపనలు రేపిన ‘ఛావా’.. ఒక సినిమాకి సమాజాన్ని ఇంతలా ప్రభావితం చేసే సత్తా ఉందా!

ప్రపంపనలు రేపిన ‘ఛావా’.. ఒక సినిమాకి సమాజాన్ని ఇంతలా ప్రభావితం చేసే సత్తా ఉందా!

అది మహారాష్ట్రలోని ఖుల్తాబాద్ పట్టణం, ఛత్రపతి శంభాజీనగర్!

గతంలో ఈ శంభాజీనగర్ పేరు ఔరంగాబాద్ గా ఉండేది..

ఎందుకంటే.. ఈ ప్రాంతంలోనే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి ఉంది.

అయితే, ఔరంగజేబు సమాధిని ఇక్కడి నుంచి తొలగించాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి..

కానీ, ఇటీవల ఛత్రపతి శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా వచ్చిన “ఛావా” సినిమా విడుదల తర్వాత పరిస్థితి మారిపోయింది.

ఛావా సినిమాలో ఛత్రపతి శంభాజీ మహరాజ్ ను ఔరంగజేబు క్రూరంగా హింసించి చంపిన సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు చూపించారు.

దీంతో ఔరంగజేబు సమాధి అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.. అతని సమాధిని అక్కడి నుంచి తొలగించాలన్న డిమాండ్లు పెరిగిపోయాయి..

ఈ క్రమంలోనే నాగ్‌పూర్‌లోని హంసపురి ప్రాంతంలో హిందూ, ముస్లిం వర్గాల మధ్య మార్చి 17వ తేదీ అర్ధరాత్రి తర్వాత ఘర్షణలు జరిగాయి.

కొందరు దుండగులు వాహనాలకు నిప్పు అంటించడంతో పాటు ఆ ప్రాంతంలోని నివాసాలు, షాపులను ధ్వంసం చేసేశారు.

వాస్తవానికి ఔరంగజేబు సమాధి చుట్టూ చాలా కాలంగా వివాదం నడుస్తోంది..

ఛావా సినిమా విడుదల తర్వాత.. ఔరంగజేబు సమాధిని కూల్చేయాలని గత కొద్ది రోజులుగా విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది.

ఇందులో భాగంగానే ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‎ను కలిసిన విశ్వహిందూ పరిషత్ బృందం.. ఇస్లాం మతంలోకి మారలేదని సిక్కు మత గురువు గురు గోబింద్ సింగ్ ఇద్ద‌రు కుమారులను ఔరంగ‌జేబు హ‌త‌మార్చాడ‌ని.. మారాఠా వీరుడు ఛ‌త్ర‌ప‌తి శంభాజీ మ‌హారాజ్‌ను కూడా చిత్ర‌హింస‌లు పెట్టి చంపార‌ని సీఎంకు వివరించింది. అలాగే, కాశీ, మ‌థుర‌, సోమ‌నాథ్‌లలో హిందూ ఆల‌యాల‌ను ఔరంగజేబు ధ్వంసం చేశార‌ని తెలిపింది.

ఔరంగజేబు స్మారక చిహ్నం.. హిందువుల బాధ, బానిసత్వానికి ప్రతీక అని.. అలాంటి సమాధిని వెంటనే తొలగించాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను కోరింది. ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే.. తామే సమాధిని కూల్చేస్తామని విశ్వహిందూ పరిషత్ హెచ్చరికలు జారీ చేసింది.

మంటపెట్టిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

ఈ క్రమంలోనే మార్చి 16వ తేదీ ఆదివారం రాత్రి మహారాష్ట్రలోని పుణేలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ మహారాష్ట్రలో మంట పెట్టేశాడు!

ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రసంగం.. ఆ తర్వాత నేతల ప్రకటన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి..

“ఔరంగజేబు సమాధిపై ఎలాంటి రాజకీయాలు అవసం లేదు.. తక్షణమే బుల్డోజర్‌తో ఆ సమాధిని కూల్చేయాలి.” అని ఎమ్మల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు..

మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు.. ఇకపై రాజకీయాల్లో కొనసాగాలన్న ఆసక్తి లేదని రాజాసింగ్ వెల్లడించారు.

భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం, మహారాష్ట్రలో ఔరంగజేబ్ సమాధిని కూల్చివేయడమే తనకున్న సంకల్పమని ప్రకటించారు.

అన్ని రాష్ట్రాల్లోని హిందూ సైన్యాన్ని సిద్ధం చేసి.. అవసరమైతే యుద్ధం చేసైనా సరే, భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చేస్తా.. ఔరంగజేబు సమాధిని కూల్చివేస్తా.. అని రాజాసింగ్ ప్రకటించారు.

తన వ్యాఖ్యల పట్ల ఎవరికైనా అభ్యంతరం ఉంటే.. తనను భారతీయ జనతా పార్టీ నుంచి తొలగించవచ్చని రాజా సింగ్ సవాల్ విసిరారు.

మహారాష్ట్ర ప్రజలు హైందవ కాషాయ జెండా కోసం ఓట్లు వేశారని.. ఇప్పుడు వాళ్లే ఔరంగజేబుకు సంబంధించిన అన్ని ఆనవాళ్లను తొలగించాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ఈ విషయంలో బీజేపీ నాయకులు చెప్పే సాకులు వినడానికి ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు.

ఔరంగజేబు సమాధిని ప్రభుత్వం తొలగించకపోతే.. తామే కూల్చేస్తామన్న విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ చేసిన ప్రకటనకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు.

రాజాసింగ్ తర్వాత బజరంగ్ దళ్ నాయకుడు నితిన్ మహాజన్ మాట్లాడుతూ.. ఔరంగజేబు సమాధిని ప్రభుత్వం తొలగించకపోతే.. అయోధ్యలో బాబ్రీ మసీదు మాదిరిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.

“హిందూ సమాజం తన ఉనికికి సంబంధించి ఆందోళన చేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు.. బాబ్రీ మసీదును తొలగించడానికి అయోధ్యలో ఏమి జరిగిందో అందరూ చూశారు.. ఔరంగజేబు సమాధిని ప్రభుత్వం తొలగించకపోతే, మేమే కరసేవ చేసి, దాన్ని కూల్చేస్తాం” అని మహాజన్ పేర్కొన్నారు.

ఈ సభలోనే ఔరంగజేబు చిత్రాన్ని రాజాసింగ్ బహిరంగంగా చింపేశారు…

అనంతరం మార్చి 17వ తేదీ సోమవారం మధ్యాహ్నం రాజా సింగ్ ఛత్రపతి శంభాజీ మహరాజ్ సమాధిని సందర్శించి, తన నివాళులు అర్పించారు.

తర్వాత, సోమవారం మధ్యాహ్నం మహల్‌ ప్రాంతంలో ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహం వద్ద బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు.

అయితే, ఈ ప్రదర్శనలో ముస్లిం మత గ్రంథాన్ని కాల్చారన్న వదంతులు వ్యాపించాయి.. దీనిపై గణేశ్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది.

గంటల్లోనే అల్లకల్లోలం

దీంతో మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తాము ఎలాంటి మత గ్రంథాన్ని దహనం చేయలేదని బజరంగ్‌దళ్‌ వివరణ ఇచ్చినా అప్పటికే అల్లర్లు మొదలైపోయాయి.

సోమవారం మధ్యాహ్నానికే కొత్వాలి, గణేష్ పేట్‌ ప్రాంతాల్లో హింస చెలరేగింది. చిట్నిస్‌ పార్క్, శుక్రవారి తలావ్‌ ప్రాంతాల్లో అత్యధికంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఈ ప్రాంతాల్లో కొన్ని వాహనాలకు దుండగులు నిప్పంటించారు. ఇళ్లపై రాళ్లు రువ్వారు.

సోమవారం అర్ధరాత్రికి నాగ్‌పుర్‌లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

నాగ్‌పుర్‌లోని హంసపురి ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి.

కొందరు దుండగులు వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటు ఆ ప్రాంతంలోని నివాసాలు, షాపులను ధ్వంసం చేశారు.

ఈ ఘటనల్లో దాదాపు 20 మంది గాయపడ్డారు. వారిలో 15 మంది పోలీసు సిబ్బందే ఉన్నారు.

రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి, పోలీసులు

దీంతో పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు నాగ్‌పూర్‌ నగర పరిధిలోని కొత్వాలి, గణేశ్‌పేట్‌, లకడ్‌గంజ్‌, పచ్పావులి, శాంతినగర్‌, సక్కర్‌దర, నందన్‌వన్‌, ఇమామ్వాడ, యశోధర నగర్‌, కపిల్‌నగర్‌లలో కర్ఫ్యూ విధించారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఘర్షణకు కారకులైన 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా హింసను విడనాడాలని, శాంతియుతంగా ఉండాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, నాగ్‌పూర్‌ లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అల్లర్ల నేపథ్యంలో ఔరంగజేబు సమాధి వద్ద భద్రతను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది.

స‌మాధి ఉన్న ఖుల్దాబాద్ ప‌ట్ట‌ణంలో అనేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.

స్టేట్ రిజ‌ర్వ్ పోలీసు ఫోర్స్‌కు చెందిన 50 మంది పోలీసులు, 30 మంది స్థానిక పోలీసులు ప‌హారా కాస్తున్నారు. వేర్వేరు పాయింట్ల వ‌ద్ద 20 మంది హోంగార్డులను మోహ‌రించారు.

ఔరంగజేబు స‌మాధి వ‌ద్ద‌కు వ‌స్తున్న విజిట‌ర్స్‌.. రిజిస్ట‌ర్‌లో త‌మ పేర్లు న‌మోదు చేసుకోవడంతో పాటు గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

ప్ర‌స్తుతం ఇక్క‌డ ప‌రిస్థితి శాంతియుతంగానే ఉంద‌ని, వదంతులను న‌మ్మ‌వ‌ద్దని స‌మాధి కేర్‌టేక‌ర్ ప‌ర్వేజ్ క‌బీర్ అహ్మ‌ద్ తెలిపారు.

ఇంతకీ ఔరంగజేబు సమాధి విషయంలో రాజకీయ పార్టీల స్టాండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఔరంగజేబు సమాధి కూల్చివేయాలన్న డిమాండ్ కు తాను అనుకూలమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ దీనికి అడ్డుపడుతోందని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో ఖులాబాద్‌లోని ఔరంగజేబు సమాధిని పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకొచ్చారని సీఎం ఫడ్నవీస్ పేర్కొన్నారు. హిందువులపై హింసకు పాల్పడిన ఔరంగజేబు సమాధికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి రావడం విచారకరమని కూడా వ్యాఖ్యానించారు.

వాస్తవానికి ఔరంగజేబు సమాధి ఒక రక్షిత స్మారక చిహ్నం.. దీన్ని ధ్వంసం చేసినా లేదా పాడు చేసినా భారత పురావస్తు శాఖ చట్టం ప్రకారం 3 నెలల జైలు శిక్ష లేదా 5 వేల రూపాయిల జరిమానా లేదా రెండూ విధించవచ్చు. అందుకే, ఔరంగజేబు సమాధి విషయంలో ఏ చర్య అయినా చట్టబద్ధంగా ఉండాలని సీఎం ఫడ్నవీస్ అంటున్నారు.

ఔరంగజేబు విగ్రహం తొలగింపుపై భిన్నాభిప్రాయాలు

ఇక, భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలనే డిమాండ్‌ను తీవ్రంగా ఖండించారు. “ఒక సమాధి లేకపోయినంత మాత్రాన చరిత్ర మారిపోదు. అందువల్ల ప్రభుత్వమే దీన్ని సంరక్షించాలి” అని అథవాలే అన్నారు.

ఇక, కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు మాత్రం మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు ఔరంగజేబు వివాదాన్ని ముందుకు తెస్తున్నారని ఆరోపిస్తున్నారు.

జల్నా జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే కళ్యాణ్ కాలే మాట్లాడుతూ.. “ఔరంగజేబు సమాధి చాలా ఏళ్లుగా ఇక్కడే ఉంది. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఈ అంశాన్ని ముందుకు తెచ్చారు” అని ఆరోపించారు. రాష్ట్రంలో ద్వేషం, హింసను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆక్షేపించారు.

కాంగ్రెస్ నాయకుడు విజయ్ వడెట్టివార్ మాట్లాడుతూ.. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నేతలకు చేయడానికి ఏ పనీ లేదు.. మహారాష్ట్ర ప్రజలు శాంతియుతంగా జీవించడాన్ని వాళ్లు ఇష్టపడరు. ఔరంగజేబు మహారాష్ట్రలో 27 సంవత్సరాలు ఉన్నాడు.. కానీ, ఇక్కడి హిందువులను ఆయన ఏమీ చేయలేకపోయాడు.. ఇప్పుడు, అతని సమాధిని తొలగిస్తే వాళ్లకు ఏమొస్తుంది..” అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రతినిధి అతుల్ లోంఢే పాటిల్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఉద్ధవ్ థాకరే శివసేన పార్టీ నేత అంబదాస్ దన్వే మాట్లాడుతూ.. ఔరంగజేబు సమాధి నిర్వహణ కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నాయని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజల్ని రెచ్చగొట్టేందుకే ఈ వివాదాన్ని లేవనెత్తారని దుయ్యబట్టారు.

ఔరంగజేబు సమాధి చుట్టూ జరుగుతున్న వివాదంపై స్థానికులు ఏమంటున్నాంటే..!

ఔరంగజేబు సమాధికి చుట్టుపక్కల చాలా షాపులు ఉన్నాయి. అందులోని ఓ దుకాణంలో పూలదండలు, ప్రసాదాలు అమ్ముకునే షేక్ ఇక్బాల్.. రాజకీయ ప్రయోజనాల కోసమే ఔరంగజేబు గురించి ఇప్పుడు కొందరు మాట్లాడుతున్నారని ఆరోపించారు.

“భారతదేశంలో కొంత మంది విద్వేషపు దుకాణాలు తెరిచారు. వీళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ప్రతిరోజూ దేశంలో నిప్పు పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు..” అని ఇక్బాల్ అన్నారు.

“300 సంవత్సరాల కిందట ఏం జరిగిందో అల్లాకు బాగా తెలుసు. అఫ్జల్ ఖాన్ సమాధికి ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆయన వారసులు ఇప్పటి వరకు రక్షణ కల్పించారు. ఔరంగజేబు సమాధి కూడా ఇక్కడ 300 ఏళ్లుగా ఉంది. దీన్ని కూడా అలాగే రక్షించాలి.” అని ఇక్బాల్ అన్నారు.

ఖుల్తాబాద్ పట్టణ మాజీ మేయర్, అడ్వకేట్ కూడా అయిన ఖైస్రుద్దీన్‌ మాట్లాడుతూ.. “ఔరంగజేబు గురించి ఇంతకు ముందూ వివాదం ఉంది, ఇప్పుడు కూడా జరుగుతోంది. కానీ చేస్తున్న ప్రకటనలను చూస్తుంటే ఇది ఒక రాజకీయ స్టంట్‌ అనిపిస్తుంది. నాయకుడు కావాలనుకునే వారు వివాదాస్పద ప్రకటనలు చేస్తూ రాత్రికి రాత్రే పాపులర్ అయి, హీరోగా మారుతున్నారు. ఈ రోజుల్లో ఇదే ట్రెండ్.” అని ఖైస్రుద్దీన్ అభిప్రాయపడ్డారు.

ఖుల్తాబాద్ మతపరమైన, చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రాంతం. భద్ర మారుతి ఆలయం ఇక్కడ ఒక ప్రసిద్ధ మతపరమైన ప్రదేశం. ఖుల్తాబాద్ ప్రాంతంలో గిరిజీ దేవి, దత్ ఆలయాలూ ఉన్నాయి.

అంతేకాదు, సూఫీ ఉద్యమ సమయంలో ఖుల్తాబాద్ కీలక ప్రాంతంగా ఉండేది. దేశ, విదేశాల నుంచి సూఫీలు ఈ ప్రదేశానికి వచ్చేవారు. ఖుల్తాబాద్‌లో చాలా మంది సమాధులు ఉన్నాయి. హిందూ- ముస్లిం ఐక్యతకు ఖుల్తాబాద్ చిహ్నంగా నిలిచిందని ఇక్కడి ముస్లిం వ్యాపారులు చెబుతున్నారు.

షర్ఫుద్దీన్ రంజాని 30 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలోని దర్గా కమిటీకి చైర్మన్‌. ఆయన కార్యాలయం ఔరంగజేబు సమాధికి సమీపంలోనే ఉంది.

ప్రస్తుత వివాదంపై షర్ఫుద్దీన్ మాట్లాడుతూ.. “ఖుల్తాబాద్ చాలా పాత ఊరు. ఇక్కడ హిందువులు, ముస్లింల మధ్య ఐక్యత ఉంది. మేం అన్ని పండుగలను కలిసి జరుపుకుంటాం. ఛత్రపతి శివాజీ జయంతి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి, హోలీ పండుగలను హిందువులతో కలిసి చేసుకుంటాం. వారిని ఈద్‌కు ఆహ్వానిస్తాం” అన్నారు.

గత కొన్ని రోజులుగా ఔరంగజేబు, ఆయన సమాధి గురించి రాజకీయ ప్రముఖులు వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారని.. ఇది ఖుల్తాబాద్‌లోని హిందూ, ముస్లిం, దళిత వ్యాపారులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Share

Related posts

కోల్ కత్తా డాక్టర్ కేసులో ఏం జరిగింది? సంజయ్ రాయ్ గురించి సంచలన నిజాలు!


Read more

Great Story: తన కష్టం ఇంకెవ్వరికీ రాకూడదని.. లక్షల జీతం వదిలేసి, ట్యాక్సీ డ్రైవర్ గా..!


Read more

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు.. సల్మాన్ ఖాన్ తో వైరం ఏంటి?


Read more
Vestibulum commodo volutpat convallis ac laoreet turpis faucibus

We love who we are and we are very proud to be the part of your business

Curabitur sit amet magna quam. Praesent in libero vel turpis pellentesque egestas sit amet vel nunc. Nunc lobortis dui neque quis.

Recent comments

    Recent posts

    • 0
      లైవ్ లో భోరున ఏడ్చిన నాగార్జున.. ఫంక్షన్ కి వచ్చిన వారంతా షాక్!
      April 30, 2025
    • 0
      కోల్ కత్తా డాక్టర్ కేసులో ఏం జరిగింది? సంజయ్ రాయ్ గురించి సంచలన నిజాలు!
      April 23, 2025

    Meta

    • Log in
    • Entries feed
    • Comments feed
    • WordPress.org
    © 2025 Betheme by Muffin group | All Rights Reserved | Powered by WordPress