SN_LogoSN_LogoSN_LogoSN_Logo
  • హోం
  • లైఫ్‌స్టైల్
  • స్పోర్ట్స్
  • న్యూస్
✕
  • Home
  • Blog
  • AP, Telangana
  • ప్రొఫెసర్ సాయిబాబా దేశద్రోహినా.. పదేళ్లు చీకటి జైల్లో నరకయాతన!

ప్రొఫెసర్ సాయిబాబా దేశద్రోహినా.. పదేళ్లు చీకటి జైల్లో నరకయాతన!

2014 మే 9వ తేదీ.. ప్రొఫెసర్ సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ సెంటర్‌లో చీఫ్ ఎగ్జామినర్‌గా ఉన్నారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు కారులో ఇంటికి బయల్దేరారు. ఇంతలో సివిల్ డ్రెస్‌లో ఉన్న కొంత మంది ఆ కారును ఆపారు. డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే ప్రొఫెసర్ సాయిబాబును కారులో నుంచి బయటికి లాగారు..

ప్రొఫెసర్ సాయిబాబా.. సివిల్ డ్రెస్‌లో ఉన్నారు, ఎవరు మీరు? అని అడిగాను. సమాధానం లేదు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగినా వాళ్లేమీ మాట్లాడలేదు.. సాయిబాబాను మొదట సివిల్ లైన్స్‌కి, ఆ తర్వాత విమానాశ్రయానికి తీసుకెళ్లారు. విమానంలో ముంబైకి తీసుకొచ్చారు.

తర్వాత నేరుగా కోర్టుకు తీసుకెళ్లారు.. అక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పదేళ్ల క్రితం నాటి ఓ కేసులో ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆయన్ను కస్టడీలోకి తీసుకుంటారా అని పోలీసులను కోర్టు అడిగినప్పుడు.. కస్టడీ అవసరం లేదని, నేరుగా జైలుకి పంపించాలని పోలీసులు కోరారు. సాధారణంగా పోలీసులు ఓ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు కస్టడీకి తీసుకొని విచారిస్తారు. కానీ, ప్రొఫెసర్ సాయిబాబాను మాత్రం విచారించకుండా నేరుగా జైలుకు పంపించారు.  

అసలు ప్రొఫెసర్ సాయిబాబా ఎవరంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలో ఓ పేద రైతు కుటుంబంలో గోల్కొండ నాగ సాయిబాబా జన్మించారు. ఐదేళ్ల వయసులోనే పోలియో సోకి రెండు కాళ్లూ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉపాధ్యాయుల సాయంతో విద్యాభ్యాసం కొనసాగించారు. కష్టపడి చదువుకున్నారు. అమలాపురం డిగ్రీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌, ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ- ఇఫ్లూలో పీజీ, ఆ పై విద్యాభ్యాసం పూర్తి చేశారు.

ఇక్కడ సాయిబాబా, ఆయన భార్య వసంత కుమారి అనుబంధం గురించి కొంత చెప్పాలి. ఇద్దరూ అమలాపురం దగ్గరలోని ఒకే గ్రామానికి చెందినవారు. హైస్కూల్ రోజుల నుంచి ఇద్దరూ కలిసి చదువుకున్నారు. సాయిబాబా వీల్ చైర్ కే పరిమితమైనా.. చాలా బాగా చదివేవారు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి సుఖాలనే కాదు కష్టాలనూ సాయిబాబాతో కలిసి వసంత పంచుకున్నారు. ఈ దంపతులకు మంజీరా అనే కుమార్తె ఉన్నారు.

ఇక, చదువు పూర్తయిన తర్వాత 2003లో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో సాయిబాబా అధ్యాపకుడిగా చేరారు. 2013లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. సాయిబాబాను అరెస్ట్ చేసే నాటికి రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌‌లో ఇంగ్లిష్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేసేవారు.

సాయిబాబా డిగ్రీ చదివే రోజుల్లోనే కమ్యూనిస్టు, వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. ఆలిండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్ లో చేరారు. 1992లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో చదివేటపుడు ఆ ఫోరమ్ ఆంధ్రప్రదేశ్ కమిటీ కార్యదర్శి అయ్యారు. 1995 నాటికి ఆ సంస్థ ఇండియా ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ తర్వాత ఆయన ఆర్‌డీఎఫ్ అనే సంస్థలో పని చేశారు. అయితే, సాయిబాబా పని చేసిన సంస్థలన్నీ నిషేధిత మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థలని పోలీసులు, హోంశాఖ అధికారులు చెబుతున్నారు.

Read Also

రోడ్డుపై అడుక్కునే అమ్మాయి.. ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో తెలిస్తే, అవాక్కవ్వాల్సిందే!

సాయిబాబాను అరెస్ట్ చేయడానికి నేపథ్యం ఏంటి.. అంతకు ముందు ఏం జరిగిందంటే..

ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మహేష్ టిర్కీ, పాండు నారోటే అనే ఇద్దరు వ్యక్తులు నిషిద్ధ సీపీఐ- మావోయిస్ట్ పార్టీ, దాని అనుబంధ సంస్థగా ఆరోపిస్తున్న రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ కోసం పనిచేస్తున్నారని, వారు ఆ సంస్థ క్రియాశీల సభ్యులని 2013 ఆగస్టులో మహారాష్ట్ర పోలీసులకు ‘రహస్య సమాచారం’ అందింది.

ఆగస్టు 22వ తేదీన అహేరీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న మహేష్, పాండులను హేమ్ మిశ్రా అనే వ్యక్తి కలిశారు. వారు ముగ్గురూ ‘ఏకాంత ప్రదేశంలో అనుమానాస్పదంగా మాట్లాడుకోవడం పోలీసులు గమనించి అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

వారిని సోదా చేసినపుడు మహేష్ వద్ద నిషిద్ధ సంస్థకు చెందిన మూడు కరపత్రాలు, ఇతర వ్యక్తిగత వస్తువులు, హేమ్ మిశ్రా వద్ద 16 జీబీ మెమొరీ కార్డు, కెమెరా తదితర వస్తువులు లభించాయని పోలీసులు చెప్పారు.

దీంతో వీరి మీద యూఏపీఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మావోయిస్టు పార్టీకి చెందిన నర్మదక్క.. తమను హేమ్ మిశ్రాను తీసుకు రావాలని పంపించినట్లు మహేష్, పాండులు ఇంటరాగేషన్‌లో నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చారని పోలీసులు పేర్కొన్నారు. అయితే, పోలీసులు తమను హింసించి ఆ వాంగ్మూలం తీసుకున్నారని వారిద్దరూ ఆ తర్వాత ఆరోపించారు.  

ఇక, ప్రొఫెసర్ సాయిబాబా తనకు ‘కాగితంలో చుట్టిన ఒక మెమొరీ కార్డు’ ఇచ్చినట్లు హేమ్ మిశ్రా ఇంటరాగేషన్‌లో చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.

దీంతో 2013 సెప్టెంబర్‌లో.. ప్రొఫెసర్ సాయిబాబా ఇంట్లో సోదాలు నిర్వహించడం కోసం మహారాష్ట్రలోని అహేరీ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వారెంట్ జారీ చేశారు.

మహారాష్ట్ర పోలీసులు ఢిల్లీ యూనివర్సిటీ ఆవరణలోని సాయిబాబా ఇంట్లో సోదాలు నిర్వహించి ఆయన వ్యక్తిగత ల్యాప్‌ట్యాప్, హార్డ్‌డిస్క్, పెన్‌డ్రైవ్‌లను తీసుకెళ్లారు.

తర్వాత ఢిల్లీ వెలుపల నాగ్‌పూర్‌లో పోలీసుల ఎదుట హాజరుకావాలని సాయిబాబాకు సమన్లు జారీ చేశారు.

అయితే, సాయిబాబాను ప్రశ్నించడం కోసం మహారాష్ట్రకు రావాలని ఎందుకు పిలిచారో వివరణ ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ అక్టోబర్‌లో మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులకు నోటీసులు ఇచ్చింది.

సోదాల్లో ల్యాప్‌ట్యాప్‌, హార్డ్ డిస్కులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకోవడంపై విచారించాలని కూడా నిర్దేశించింది.

దీంతో 2014 జనవరిలో సాయిబాబాను ఢిల్లీలోని ఆయన నివాసంలో పోలీసులు, నిఘా సిబ్బందితో కూడిన బృందం మూడు గంటల పాటు ప్రశ్నించింది. ఆ తర్వాత పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కట్ చేస్తే.. సరిగ్గా 4 నెలల తర్వాత
2014 మే 9 మధ్యాహ్నం ఢిల్లీ యూనివర్సిటీ ఆవరణలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పోలీసులు ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్ట్ చేశారు. ఆయన నిషేధిత మావోయిస్టు సంస్థలో సభ్యుడనీ, ఆరు నెలల్లో నాలుగు సార్లు ఆయన్ను ప్రశ్నించిన తర్వాతే అరెస్ట్ చేశామని గడ్చిరోలి డీఐజీ తెలిపారు.

మహేష్ కరీమన్ టిర్కీ, పాండు పోరా నారోట్, హేమ్ కేశవాదత్త మిశ్రా, ప్రశాంత్ రాహి నారాయణ్ సాంగ్లికర్, విజయ్ నాన్ టిర్కీలతో పాటు.. ప్రొఫెసర్ సాయిబాబా మీద చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని 13, 18, 20, 38 39 సెక్షన్లు, భారత శిక్షా స్మృతి 120బి సెక్షన్ కేసు నమోదు చేశారు.

మరుసటి రోజు ఆయన్ను మహారాష్ట్రలోని అహేరీ కోర్టులో హాజరు పరిచిన పోలీసులు.. నాగ్‌పూర్ సెంట్రల్ జైలులోని ‘అండా సెల్’కు తరలించారు. అదే నెల 15వ తేదీన డీయూ రామ్‌లాల్ ఆనంద్ కాలేజీ ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది.

ఈ కేసులో పోలీసులు ఆరోపణలు ఏంటంటే..

”2013 సెప్టెంబర్ 12 నాడు లేదా అంతకు ముందు ఈ ఆరుగురు నిందితులూ భారత ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి ప్రజలను సమీకరించడానికి పూనుకున్నారు.

నేరపూరిత బలప్రయోగం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, భారత ప్రభుత్వాన్ని లోబరచుకోవడానికి.. ప్రజల ప్రాణాలు, ఆస్తుల మీద భారీ స్థాయి హింస, విధ్వంసం చేయడానికి కుట్ర పన్నారు.

సాధారణ పౌరుడికి ప్రజాస్వామ్య ప్రభుత్వం మీద విశ్వాసాన్ని సడలించడానికి, క్షీణింపజేయడానికి, తద్వారా చట్టబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వ వ్యవస్థను అస్థిరపరచడానికి కుట్ర చేశారు.

రహస్య సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా వేర్పాటు, తిరుగుబాటు ఆలోచనలను వ్యాప్తి చేయడానికి సిద్ధపడ్డారు.

ఈ నేరపూరిత కుట్ర లక్ష్యాలను సాధించడానికి, భారతదేశంలో అక్రమ మార్గాల ద్వారా డబ్బు సేకరించడానికి కుట్ర చేశారు.

నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా- మావోయిస్ట్, దాని అనుబంధ సంస్థ రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ ల చట్టవ్యతిరేక కార్యకలాపాలను కొనసాగించడానికి కుట్రపన్నారు.

హింసా ప్రయోగం లేదా ఇతర చట్టవ్యతిరేక మార్గాల్లో ఉగ్రవాద చర్య చేపట్టడానికి కుట్రలు చేశారు.” అనేవి పోలీసుల ఆరోపణలు..

అలాగే, 2013 నవంబర్‌లో కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్‌లో.. ”నగరాలు, పట్టణాల్లోని సీపీఐ- మావోయిస్టు మేధావులు, మద్దతుదారులు భారత ప్రభుత్వాన్ని చెడుగా చిత్రీకరించడానికి, తప్పుడు సమాచారంతో అఫఖ్యాతి పాలు చేయడానికి ఉమ్మడిగా ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నారు. నిజానికి, మావోయిస్టు ఉద్యమాన్ని సజీవంగా ఉంచింది ఈ మేధావులే. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ శ్రేణుల కన్నా వీరు చాలా రకాలుగా మరింత ప్రమాదకరం” అని పేర్కొంది.

కోర్టులో విచారణ ఎలా జరిగిందంటే..

ఈ కేసుపై విచారణ జరిపిన మహారాష్ట్రలోని గడ్చిరోలి సెషన్స్ కోర్టు 2017 మార్చిలో తీర్పు వెలువరించింది. హేమ్ మిశ్రా నుంచి స్వాధీనం చేసుకున్న మెమొరీ కార్డు, సాయిబాబా ఇంట్లో సోదా చేసి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్, హార్డ్‌ డిస్కులు తదితర ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ విశ్లేషణ ద్వారా సేకరించిన పత్రాలు, ఫొటోలు, వీడియోల ద్వారా.. సాయిబాబా తదితరులు మావోయిస్టు పార్టీ, ఆర్‌డీఎఫ్ కార్యకలాపాల్లో క్రియాశీలంగా ఉన్నట్లు నిరూపణ అవుతోందని కోర్టు తన తీర్పులో వెల్లడించింది.

ప్రొఫెసర్ సాయిబాబా 90 శాతం వైకల్యంతో ఉన్నప్పటికీ ఆయన మీద దయ చూపలేమని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

“ప్రొఫెసర్ సాయిబాబా శారీరకంగా అంగవైకల్యుడైనప్పటికీ మానసికంగా దృఢంగా ఉన్నారు. ఆయన నిషిద్ధ సీపీఐ-మావోయిస్ట్ కు, ఆ పార్టీ బాహ్య సంస్థ ఆర్‌డీఎఫ్‌కు చెందిన మేధావి, ఉన్నతస్థాయి నాయకుడు. ఈ ఆరుగురు నిందితులు, నిషిద్ధ వామపక్ష పార్టీ సభ్యుల హింసాత్మక కార్యకలాపాల వల్ల గడ్చిరోలి జిల్లా 1982 నుంచి ఇప్పటి వరకూ సంఘర్షణ స్థితిలో ఉంది. నక్సలైట్ల హింసాత్మక కార్యకలాపాల వల్ల ఆ ప్రాంతం పారిశ్రామికంగా కానీ ఇతరత్రా గానీ అభివృద్ధి జరగడం లేదు. కాబట్టి నా అభిప్రాయంలో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష కూడా సరిపోదు. కానీ, యూఏపీఏ చట్టంలోని 18, 20 సెక్షన్లు కోర్టు చేతులను కట్టివేస్తున్నాయి. కాబట్టి, సాయిబాబా సహా ఐదుగురు నిందితులకు జీవిత కాల జైలు శిక్ష సరైనది.” అని గడ్చిరోలి సెషన్స్ జడ్జి తీర్పు వెలువరించారు. ఈ కేసులో మరొక నిందితుడు విజయ్ టిర్కీకి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.

దీంతో ఈ తీర్పును ప్రొఫెసర్ సాయిబాబా తరఫు న్యాయవాదులు బాంబే హైకోర్టులో అప్పీలు చేశారు.

ఈ కేసుకు సంబంధించి సాయిబాబా ఇచ్చిన వివరణ ఏమంటే..

“నేను గిరిజనుల హక్కుల కోసం గొంతెత్తాను. అందులో భాగంగా అనేక ప్రజా సంఘాలు, వివిధ వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి. ఇదే విషయమై పని చేస్తున్న చాలా సంస్థలు నన్ను కన్వీనర్‌గా ఎన్నుకున్నాయి. అభివృద్ధి పేరుతో గిరిజనులపై జరుగుతున్న మారణహోమానికి, ఆపరేషన్‌ గ్రీన్ హంట్‌కి వ్యతిరేకంగా గిరిజనుల రక్షణ కోసం మేము పోరాడుతున్నాం.

దేశంలోని పది కోట్ల మంది గిరిజనుల అణచివేతకు వ్యతిరేకంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ సంస్థలతో కలిసి పోరాటం సాగించాం. అందుకే మా గొంతునొక్కేందుకే నాపై కేసు బనాయించి, తప్పుడు కేసులు నమోదు చేశారని తెలిసింది.” అని సాయిబాబా చెప్పారు.

ఈ క్రమంలోనే కేసుపై మరోసారి లోతుగా విచారించిన బాంబే హైకోర్టులోని నాగపూర్ బెంచ్.. 2022 అక్టోబర్ లో జీఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి గడ్చిరౌలి కోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది.

దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సాధారణంగా సుప్రీం కోర్టుకు శనివారం సెలవు ఉంటుంది. అయితే, జస్టిస్ ఎం.ఆర్ షా, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన సుప్రీం కోర్టు ప్రత్యేక ధర్మాసనం ఈ కేసుకున్న ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విచారణ చేపట్టింది.

విచారణ సందర్భంగా ప్రొఫెసర్ సాయిబాబాపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

55 ఏళ్ల వయసులో 90 శాతం శారీరక వైకల్యంతో ఉన్న సాయిబాబా.. మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదని ఆయన న్యాయవాది బసంత్ సుప్రీం కోర్టుకు విన్నవించారు.

సాయిబాబాకు ఆలోచించే మెదడు ఉందని సొలిసిటర్ జనరల్ చెబుతున్నారని, కానీ ఆయన నేరానికి పాల్పడినట్లు చూపే ఆధారాలు ఏమీ లేవని బసంత్ అన్నారు.

దీంతో.. “తీవ్రవాద, మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి ఆ మెదడే అన్నింటి కంటే ఎక్కువ ప్రమాదకరమైనది. మెదడుతో పని చేసే వాళ్లు నేరంలో ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన పని లేదు.” అని జస్టిస్ ఎంఆర్ షా అన్నారు. ఈ మాటను తాను ఈ నిర్దిష్టమైన కేసును దృష్టిలో పెట్టుకుని అనడం లేదని కూడా షా చెప్పారు.

ఇక, “ఈ కేసులో వాస్తవాలు చాలా ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. జమ్మూ కశ్మీర్‌లో ఆయుధాల కోసం పిలుపు ఇవ్వడం, పార్లమెంటును కూల్చడానికి మద్దతు తెలపడం, నక్సలైట్లతో సమావేశాలు ఏర్పాటు చేయడం, భద్రతా దళాల మీద దాడులు చేయడం వంటి తీవ్ర నేరాలకు పాల్పడ్డ వారిని విడుదల చేయడం చాలా ప్రమాదకరం.” అని సోలిసిటర్ జనరల్ చెప్పారు.  

ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం.. నిందితుల జీవిత ఖైదును రద్దు చేస్తూ ఇచ్చిన హైకోర్టు తీర్పును సస్పెండ్ చేస్తున్నామని.. వారి విడుదలపై స్టే విధిస్తున్నామని ప్రకటించింది. అంతేకాకుండా, తనను జైల్లో కాకుండా గృహ నిర్బంధంలో ఉంచాలన్న సాయిబాబా చేసిన అభ్యర్థనను కూడా సుప్రీం కోర్టు తిరస్కరించింది. సున్నితమైన అంశాలతో కూడిన ఈ కేసును మరింత లోతుగా విచారిస్తామని కూడా ధర్మాసనం ప్రకటించింది. ఈ కేసును మళ్లీ మరింత లోతుగా విచారించాలని బాంబే హైకోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఈ క్రమంలో కేసును మరింత లోతుగా విచారించిన బాంబే హైకోర్టు.. 2024 మార్చి 5న మరోసారి ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. కమ్యూనిస్టు లేదా నక్సలైట్ సాహిత్యాన్ని ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడం, ఏదైనా భావజాలానికి మద్దతుదారుగా ఉండడం యూఏపీఏ చట్టం కిందకు రాదని తేల్చిచెప్పింది.  

దీంతో 2024 మార్చిలో సాయిబాబా నిర్దోషిగా జైలు నుంచి విడుదలయ్యారు.

జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ప్రొఫెసర్ సాయిబాబో జైలులో గడిపిన రోజుల్ని తలుచుకుని మీడియా ముందు కన్నీటిపర్యంతమయ్యారు.

జైల్లో జీఎన్ సాయిబాబాను ఉంచిన గది కేవలం 8 అడుగులు పొడవు, పది అడుగుల వెడల్పు ఉంటుంది. అండా బ్యారక్‌గా పిలిచే ఈ జైలు గదికి కిటికీలు ఉండవు. ఒకవైపు ఇనుప కడ్డీలతో ఉంటుంది.

వాస్తవానికి అండా బ్యారక్ అంటే టార్చర్ సెల్..

బ్రిటిష్ కాలంలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్లను ఈ అండా సెల్ లో పెట్టి హింసేవారు..

ఇక, సాయిబాబాను అండా సెల్ లో పెట్టడమే కాకుండా.. దాని, ముందు సీసీటీవీ కెమెరా కూడా ఏర్పాటు చేశారు.. సాయిబాబా ప్రతి కదలికను 24 గంటలు రికార్డు చేసేవారు.

దీంతో ఈ సీసీటీవీని తక్షణమే తొలగించాలని.. ఆయన కుటుంబ సభ్యులు జైలు అధికారులను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అలాగే న్యాయవాది అశోక్ సోర్డే జైలు ములాఖత్ ద్వారా సాయిబాబాను కలిసి, కొన్ని వస్తువులతో పాటు ఒక వాటర్ బాటిల్‌ను కూడా ఇస్తే.. జైలు అధికారులు వాటర్ బాటిల్‌ను సాయిబాబాకు ఇవ్వటానికి నిరాకరించారని వారు తెలిపారు. సాయిబాబా మంచం పక్కన స్టీల్ థర్మోస్ బాటిల్‌ను ఉంచి ఫొటో తీసుకున్నారని.. కానీ భుజాల కండరాలు దెబ్బతినటం వల్ల సాయిబాబా ఆ బాటిల్‌ను పైకి ఎత్తలేరని వివరించారు. ఆయన కదలలేరు కాబట్టి తనకు తానుగా వెళ్లి నీళ్లు తెచ్చుకోలేరనీ పేర్కొన్నారు. ఈ ఎండా కాలంలో మొత్తం జైలులో తాగటానికి మంచినీళ్ల బాటిల్ లేని ఒకే ఒక్క ఖైదీ సాయిబాబానే అని చెప్పారు.

ఇక, జీఎన్ సాయిబాబాకు పోలియో వల్ల చిన్నతనం నుంచి వీల్‌చైర్ వాడుతున్నారు. అది ఆయన కనీస అవసరాల్లో ఒకటి.

“జైల్లో టాయిలెట్‌ వరకూ వీల్‌చైర్‌‌లో వెళ్లలేం. స్నానం చేసే చోటుకి కూడా వెళ్లలేం. నేను నా కాళ్లపై నిలబడలేను. నేను బాత్రూమ్‌కి వెళ్లాలన్నా, స్నానం చేయాలన్నా, పడుకోవాలన్నా, అన్ని పనులకూ ఇద్దరు మనుషులు కావాలి. జైలు సెల్‌లోనూ నేను అటూఇటూ తిరగలేను. అలాంటి పరిస్థితుల మధ్య పదేళ్ల పాటు జైల్లో నరకయాతన పడాల్సి వచ్చింది. వాస్తవానికి, నేను ఇంత కాలం బతుకుతానని జైలు అధికారులకు కూడా నమ్మ లేదు. కానీ, ఇవాళ కాకపోతే రేపు నిజం కచ్చితంగా బయటికి వస్తుందని అనుకుంటున్నా” అని సాయిబాబా చెప్పారు.

అయితే, ఇంతకాలం జైళ్లో గడిపిన సాయిబాబాకు భారత న్యాయవ్యవస్థపై నమ్మకముందా? యూఏపీఏ వంటి కఠిన చట్టాల గురించి మీ అభిప్రాయమేంటని అడగగా..

“భారత న్యాయవ్యవస్థ దేశ ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నా. అలా జరగదని చెప్పను కానీ, భారత న్యాయవ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని మాత్రం కచ్చితంగా చెబుతాను. ప్రధాన న్యాయమూర్తి కూడా బెయిల్ ఎందుకు ఇవ్వలేదో పదేపదే చెబుతున్నారు. కోర్టు ఆదేశాలు కూడా వస్తాయి. ఇంతలో మళ్లీ బెయిల్ తిరస్కరణకు గురవుతుంది.

ముఖ్యంగా గిరిజనులు, దళితులు, మైనారిటీలు, ఓబీసీల్లోని కొన్ని వర్గాలకు కచ్చితంగా బెయిల్ రాదు. మనం జైళ్లలోకి వెళ్లి చూస్తే విచారణ ఖైదీలుగా ఈ వర్గాలకు చెందిన వారే జైళ్ల నిండా ఉంటారు.” అని సాయిబాబా అన్నారు.

ఇక, యూఏపీఏ చట్టం గురించి మాట్లాడుతూ.. ”ఇది ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన చట్టం. ఇంతటి క్రూరమైన చట్టం ప్రపంచంలోని ఏ దేశంలోనూ అమల్లో లేదు. ఇది దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు విరుద్ధం. నేను ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్నా. కానీ, అదే చట్టం కింద నన్ను జైల్లో పెట్టి.. నా గొంతు నొక్కేశారు.” అని సాయిబాబా వాపోయారు.

జైలుకి వెళ్లిన అనంతరం సాయిబాబాను ఢిల్లీ యూనివర్సిటీ ఉద్యోగం నుంచి తొలగించడంపై సాయిబాబా మాట్లాడుతూ.. ”నేను టీచర్‌గా జీవించి, టీచర్‌గానే చనిపోవాలనుకుంటున్నా. నా ఉద్యోగం నాతోనే ఉండాలనుకుంటున్నా. దాని కోసం పోరాడాల్సిన అవసరం లేదు.” అని సాయిబాబా అన్నారు.

ఇక్కడ సాయిబాబా భార్య వసంత గురించి కచ్చితంగా చెప్పుకోవాలి.

ఎందుకంటే తన భర్త కోసం వసంత పదేళ్ల పాటు ఓ యుద్ధమే చేశారు.

జైలు లోపల సాయిబాబా పోరాడితే.. బయట వసంత ఆయన కోసం దాదాపుగా ఒంటరి పోరు చేశారు. అరెస్టయ్యాక సాయిబాబాకు ఉద్యోగం పోయింది. ఒక వైపు ఇల్లు గడవడమే కష్టం. మరో వైపు భర్త కోసం జైలు వెలుపల పోరాటం. వసంత కష్టాలు వర్ణనాతీతం. అయినా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో సాయిబాబాకు అండగా వసంత చివరి వరకూ నిలబడ్డారు.

సాయిబాబా మావోయిస్టు పార్టీ కోసం పనిచేస్తున్నారని వాళ్లే ప్రచారం చేసి.. జైలు శిక్ష వేశారు తప్ప సాక్ష్యాల ఆధారంగా కాదని వసంత కుమారి విమర్శించారు.

“ఈ కేసులో సాక్షులు 26 మంది ఉన్నారని చెప్పారు. కానీ సాయిబాబా కేసులో ఒక్క సాక్షినే చూపారు. అతడు కూడా పోలీసు మనిషేనని డిఫెన్స్ న్యాయవాది నిరూపించారు. అసలు ప్రధానంగా చూపిన ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు డిఫెన్స్ విచారణకు రానేలేదు. డిఫెన్స్ వాదనలను ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదు. 827 పేజీల తీర్పులో 300 పేజీలు సాయిబాబా మీదే రాశారు” అని ఆమె పేర్కొన్నారు.  

“2014లో అరెస్ట్ చేసి జైలులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల సాయిబాబా ఎడమ చేయి నరాలు దెబ్బతిన్నాయి. దానికి వైద్యం అందించకపోవడంతో ఆ చేయి బాగా పాడయింది. పాంక్రియాస్ దెబ్బతినింది. ప్రొస్టేట్ సమస్య పెరిగింది. మూత్రాశయంలో రాళ్లున్నాయి. 15 సంవత్సరాలుగా బీపీ కూడా ఉంది” అని వసంత చెప్పారు. జైలులో నిర్లక్ష్యం కారణంగా సాయిబాబాకు అనారోగ్య సమస్యలు ఇంకా తీవ్రమయ్యాయని ఆమె ఆరోపించారు.

“ఆయనకు ఒక చెయ్యి, మెదడు మాత్రమే పని చేస్తున్నాయి. సాయి బయట ఇన్నప్పుడు అన్నీ సదుపాయాలున్నప్పటికీ.. చలికాలంలో ఆయన చేతులు కొంకర్లు పోతాయి. అలాంటిది నాగ్‌పూర్ జైలులోని అండా సెల్ పైన అంతా తెరిచే ఉంటుంది. వర్షం వచ్చినా తడిసిపోతుంది. ఎండ, వాన, చలి ఏదైనా ఆ సెల్‌లోకి నేరుగా వచ్చేస్తుంది” అని వసంతకుమారి వివరించారు.

“సాయిబాబాకు రోజువారీ మందులు కూడా అందించ లేదు. జైలు డాక్టర్లకు మందులు అందించిన తర్వాత కూడా ఆయనకు ఆ మందులు చేరడానికి తొమ్మిది, పది రోజులు పట్టేది. ఫలితంగా ఆయన రెండు రోజుల్లో నాలుగు సార్లు కళ్లు తిరిగిపడిపోయేవారు.” అని వసంత చెప్పారు.

ఇలాంటి పరిస్థితుల మధ్య సాయిబాబా జైలు నుంచి నిర్దోషిగా విడుదలైన 5 నెలల్లోనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత నెల సెప్టెంబర్ 28వ తేదీన సాయిబాబాకు గాల్‌బ్లాడర్ ఆపరేషన్ జరిగింది.

ఇటీవల మళ్లీ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేరారు. గాల్‌బ్లాడర్ తొలగించి స్టంట్ వేసిన చోట చీము పట్టింది. తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, హైఫీవర్‌తో బాధపడ్డారు. డాక్టర్లు చీము తొలగించినప్పటికీ ఆయన తీవ్ర నొప్పితో విలవిలలాడారని సాయిబాబా భార్య వసంత తెలిపారు. ఈ నెల 11న ఆయన పరిస్థితి మరింత క్షీణించిందని, అంతర్గత రక్తస్రావంతోపాటు పొత్తికడుపులో వాపుతో ఆయన బాధపడ్డారని, బీపీ పడిపోయిందని.. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా సాయిబాబా కోలుకోలేకపోయారని వసంత తెలిపారు. ఈ క్రమంలోనే 2024 అక్టోబర్ 12వ తేదీన 57 ఏళ్ల వయసులో సాయిబాబా కన్నుమూశారు.

సాయిబాబా చేయని తప్పుకి అన్యాయంగా అరెస్ట్ చేశారని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. హైకోర్టు కూడా సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిందని గుర్తు చేస్తున్నారు. కానీ, జైలులో సాయిబాబా ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవడం వల్లే అనారోగ్యం పాలయ్యారని, ఇప్పుడు ఆయన చావుకు బాధ్యత ఎవరిదని ప్రజా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Share

Related posts

లైవ్ లో భోరున ఏడ్చిన నాగార్జున.. ఫంక్షన్ కి వచ్చిన వారంతా షాక్!


Read more

Great Story: తన కష్టం ఇంకెవ్వరికీ రాకూడదని.. లక్షల జీతం వదిలేసి, ట్యాక్సీ డ్రైవర్ గా..!


Read more

Real Story: టాటా నానో ఎందుకు ఫెయిలైంది.. మమతా బెనర్జీ, టాటా మధ్య ఏం జరిగింది?


Read more
Vestibulum commodo volutpat convallis ac laoreet turpis faucibus

We love who we are and we are very proud to be the part of your business

Curabitur sit amet magna quam. Praesent in libero vel turpis pellentesque egestas sit amet vel nunc. Nunc lobortis dui neque quis.

Recent comments

    Recent posts

    • 0
      లైవ్ లో భోరున ఏడ్చిన నాగార్జున.. ఫంక్షన్ కి వచ్చిన వారంతా షాక్!
      April 30, 2025
    • 0
      కోల్ కత్తా డాక్టర్ కేసులో ఏం జరిగింది? సంజయ్ రాయ్ గురించి సంచలన నిజాలు!
      April 23, 2025

    Meta

    • Log in
    • Entries feed
    • Comments feed
    • WordPress.org
    © 2025 Betheme by Muffin group | All Rights Reserved | Powered by WordPress