లైవ్ లో భోరున ఏడ్చిన నాగార్జున.. ఫంక్షన్ కి వచ్చిన వారంతా షాక్!
టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున కన్నీళ్లు పెట్టుకున్నాడు.. అవును మీరు చూస్తోంది నిజమే.. నాగార్జున నిజంగానే ఏడ్చారు! ప్రతి మనిషి పైగి ఎంత గంభీరంగా కనిపించినా.. కొనిసార్లు ఎమోషన్స్ తన్నుకొస్తుంటాయి.. మనకి తెలియకుండానే కన్నీళ్లు బయటికొస్తాయి.. అయితే, నాగార్జున కంటతడి పెట్టుకున్న సందర్భంగా వేరు..!
అది స్టార్ మా పరివార్ అవార్డుల వేదిక.. మాటీవీ సీరియల్స్ లో నటించిన నటీనటులకు అవార్డులు ఇచ్చే ఈ వేడుకను అత్యంత గ్రాండ్‌గా నిర్వహించారు. ఒకప్పుడు మా టీవీ ఓనర్.. ప్రస్తుతం స్టార్ మాలో పార్ట్ నర్ అయిన అక్కినేని నాగార్జున ముఖ్య అతిథుల్లో ఒకరిగా వచ్చాడు. అదే వేదిక మీద తెలుగు దిగ్గజ నటులు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఏన్నార్ పాత పాటలకు నటీనటులు స్టేజ్ పై డ్యాన్సులు వేశారు. సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు నాగేశ్వరరావు గురించి గొప్పగా చెప్పారు. ఇండస్ట్రీకి ఏఎన్నార్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తర్వాత.. నాగార్జున సోదరి సుశీల, సతీమణి అమల.. ఏఎన్నార్ గురించి మాట్లాడారు. ఆ సమయంలో నాగార్జున స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్నాడు. ఆ క్లిప్పింగ్ చూస్తే నాగార్జున తన దుఖాన్ని ఆపుకోవడానికి చాలా ప్రయత్నించినట్లు కనిపించింది. ఎందుకంటే.. నాగార్జున కళ్లు ఎర్రగా మారిపోయాయి.. కళ్లు ఉబ్బిపోయి ఉన్నాయి.. ఎంతోసేపు దుఖాన్ని ఆపుకుంటే తప్పు కళ్లు ఇలా మారవు!
వాస్తవానికి నాగార్జున చాలా ప్రాక్టికల్ మనిషి! తనకు క్యాన్సర్ ఉందని.. ఇంకొంత కాలమే బతుకుతానని తన కుటుంబానికి ఏన్నార్ ముందే చెప్పారు. తర్వాత పబ్లిక్ గా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తన క్యాన్సర్ గురించి ప్రపంచానికి తెలియజేశారు. ఆ సమయంలో కూడా నాగార్జున పెద్దగా హైరానా ఏమీ పడలేదు. ఏఎన్నార్ కి చివరి రోజుల్లో ఏం చెయ్యాలో అన్నీ ప్లాన్ చేసి ఆయనకు అందించారు. నాన్న గారి చివరి గుర్తుగా “మనం” అనే క్లాసిక్ సినిమా తీసి.. ప్రేక్షకులకు అందించారు. తన తండ్రి ఇంకొన్ని రోజుల్లో చనిపోతున్నాడని తెలిసి కూడా.. ఇలా ఎంత మంది చేయగలరు చెప్పండి?
తండ్రి నాగేశ్వరరావు చనిపోయినప్పుడు కూడా నాగార్జున గుక్కపెట్టి ఏడ్చింది లేదు.. తన తండ్రి చాలా ప్రశాంతంగా తాను కోరుకున్న విధంగానే చనిపోయారని చెప్పారు. ఎంత ప్రాక్టికల్ మనిషి అయినా.. తండ్రి లేని లోటు, పూడ్చలేనిది కాబట్టి.. అంత్యక్రియల సమయంలో కంటతడి పెట్టుకున్నారు. ఆ ఒక్క సందర్భంలో తప్ప.. నాగార్జున ఏడ్చిన సందర్భాలు చాలా తక్కువ! ఎప్పుడూ పాజిటివ్ మైండ్ తో ముందుకు వెళ్తారు. శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉంటారు. సినిమాల్లోనే కాదు వ్యాపార రంగంలోనూ నాగార్జున మోస్ట్ సక్సెస్ ఫుల్ మ్యాన్!
కానీ, గత కొంత కాలంగా నాగార్జునకు జీవితంలో బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు నాగార్జునను వృత్తిపరంగా, వ్యాపారపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ కోలుకోలేని దెబ్బతీసేలా ఉన్నాయి. అందుకే, ఏఎన్నార్ గురించి కుటుంబ సభ్యులు చెప్తున్నప్పుడు.. “మా నాన్నే బతికుంటే.. ఇన్ని కష్టాలు ఉండేవా.. నాన్నే ఉండి ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉండేది..” అని తలుచుకుని నాగార్జున కన్నీరు పెట్టుకున్నాడని.. ఇటీవల జరిగిన పరిణామాలను చూసినప్పుడు అనిపిస్తుంది.
తన వ్యాపార సామ్రాజ్యంలో ఎంతో కీలకమైన ఎన్ కన్వెన్షన్ హాలును రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చేసింది. ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జా కోరల నుంచి విముక్తి చేయడానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ.. సింపుల్ గా చెప్పాలంటే హైడ్రాని తెలంగాణ ఏర్పాటు చేసింది. దీనికి చీఫ్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ ను నియమించింది. ఈ హైడ్రా తొలి బిగ్ ఆపరేషనే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత! అది నాగార్జునకు బిగ్ షాక్.. దీనిపై ఎలా ముందుకెళ్లాలో కూడా తెలియని దుస్థితి.. ఎందుకంటే, చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో కొంత నిర్మాణం జరిగినట్టు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వమూ కొంత సతాయించినప్పటికీ, హైకోర్టు తీర్పులతో కాస్త వెనక్కి తగ్గింది.
అయితే, రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే.. నాగార్జున ఎన్.కన్వెన్షన్ గురించి అసెంబ్లీలో లేవనెత్తారు. “సినిమా హీరోలంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవారు.. సమాజం కూడా వాళ్లను ఆదర్శంగా తీసుకుంటుంది. కానీ, హైటెక్ సిటీ ఎదురుగా ఉన్న చెరువు భూముల్లో హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ కట్టారు. చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టిండ్రు. కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. ఈ విషయం పదేపదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది. టీవీ ఛానెళ్లలో, పేపర్లలో చూపించారు. కానీ, ఇప్పటి వరకు అక్కినేని నాగార్జున ఆక్రమించుకొని కట్టిన కట్టడాలను ఎందుకు తొలగించలేదు? మీకు ఏ శక్తులు అడ్డం పడుతున్నాయ్? ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో సూటిగా సమాధానాం చెప్పాలి..” అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రశ్నించారు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఈ అంశాన్ని లేవనెత్తారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. చెరువుల్ని చెరబట్టి కట్టిన అక్రమ నిర్మాణాలను కూలగొడతామని పదే పదే చెప్పారు.
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ను హైడ్రా బృందం కూల్చివేసింది. హైదరాబాద్ లోని మాదాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య ఎన్. కన్వెన్షన్ ను అధికారులు నేలమట్టం చేశారు. కూల్చివేతలపై హైకోర్టు స్టే ఇచ్చినా.. అప్పటికీ ఎన్ కన్వెన్షన్ ప్రధాన భాగాన్ని కూల్చేశారు.
లీగల్ గా విషయాలు పక్కనపెడితే.. ఎన్.కన్వెన్షన్ విషయంలో నాగార్జునకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. చెరువు మధ్యలో అడ్డంగా గోడకట్టి ఎన్.కన్వెన్షన్ కట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ప్రజలు కూడా ఎన్.కన్వెన్షన్ కూల్చివేయడం తప్పేమీ కాదనే అభిప్రాయానికి వచ్చారు.
ఎన్.కన్వెన్షన్ కూల్చివేత అంశాన్ని అందరూ మర్చిపోతున్న సమయంలో తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీ గురించి అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు నాగార్జున కుటుంబాన్నే కాదు.. తెలుగు ప్రజలందర్నీ దిగ్భ్రాంతికి గురి చేశాయి. సినీ ఇండస్ట్రీ మొత్తం ముక్తకంఠంతో మంత్రి వ్యాఖ్యలను ఖండించింది.
ఎన్.కన్వెన్షన్ కూల్చివేత నాగార్జున వ్యాపారానికి పెద్ద దెబ్బ అయితే.. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అక్కినేని కుటుంబం పరువు తీసే వ్యవహారం.
“నాగచైతన్య, సమంత విడాకులు 100 శాతం కేసీఆర్, కేటీఆర్ చేయబట్టే అయ్యింది. ఎందుకంటే.. ఎన్.కన్వెన్షన్ హాల్‌ను కూల్చకూడదు అంటే.. సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్లమని నాగార్జున వాళ్లు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్లను అని చెబితే.. వింటే విను.. లేకపోతే వెళ్లిపో అని విడాకులు ఇచ్చారు.” అని కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై నాగార్జున కుటుంబం కోర్టును ఆశ్రయించింది. కానీ.. ఈ విషయం పదే పదే వార్తల్లో వస్తున్నన్ని రోజులూ తమ కుటుంబం పరువుకు భంగమే.. మరి ముఖ్యంగా సమంతను కేటీఆర్ దగ్గరకు పంపించడానికి తండ్రీకొడుకులు ఒత్తిడి చేశారనే ఆరోపణ నాగార్జునకు బిగ్ షాక్…
మరోవైపు సినీ ఇండస్ట్రీలో పరాజయాలు, కొడుకుల భవిష్యత్తు కూడా నాగార్జున ఆందోళనకు మరో కారణం. 65 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్ కాపాడుకుంటూ ఈరోజుకూ మెయిన్ స్ట్రీమ్ హీరో పాత్రలే వేస్తున్నా సరే, తన స్థాయి హిట్ మాత్రం పడట్లేదు. ఒకప్పుడు నాగార్జున టాలీవుడ్ లో నంబర్ 1 స్థానానికి గట్టి పోటీ ఇచ్చిన హీరో! కానీ.. తన సహచర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ తమ మార్కెట్ ను కాపాడుకుంటూ ఇప్పటికీ భారీ సినిమాలు తీస్తున్నారు. వీరిద్దరి సినిమాలు అవలీలగా 100 కోట్లు దాటేస్తున్నాయి. కానీ, నాగార్జున మార్కెట్ మాత్రం దారుణంగా పడిపోయింది.
అదే సమయంలో తన పెద్ద కుమారుడు నాగచైతన్య, సమంతల వైవాహిక జీవితం విఫలమై విడాకులు తీసుకున్నారు. చిన్న కొడుకు అఖిల్ కు నిశ్చితార్థం జరిగాక.. పెళ్లి రద్దయిపోయింది. అలాగే, సినిమాల్లోనూ అఖిల్ ను వరుస ప్లాపులు పలకరించాయి. అఖిల్ కెరీర్, వ్యక్తిగత జీవితం ఈరోజుకూ గాడినపడలేదు.
నాగేశ్వరరావు, నాగార్జున రేంజులో అక్కినేని ఫ్యామిలీ హీరోలు టాప్ చైర్ లో లేరన్నది జరమెరిగిన సత్యం! ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ నాగచైతన్య ‘తండేల్’ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే.. నాగచైతన్యకి కూడా ప్యాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు వస్తుంది.
గత కొన్నేళ్లలో నాగార్జున కుటుంబంలో జరిగిన మంచి ఏమైనా ఉందా అంటే.. అది నాగచైతన్య, శోభిత ధూళిపాళ్లల నిశ్చితార్థం. విడాకుల బాధ నుంచి నాగచైతన్య త్వరగానే కోలుకొని.. మరో పెళ్లికి సిద్ధం కావడం అక్కినేని ఫ్యామిలీలో ఆనందం నింపింది. ఇంతలోనే నాగ చైతన్య వ్యక్తిగత జీవితం గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఇలా, అక్కినేని ఫ్యామిలీ కొన్నేళ్లుగా ఏదో ఒక ఇష్యూతో, ఫెయిల్యూర్లతో ఇబ్బంది పడుతూనే ఉంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్‌బాస్’ రియాలిటీ షో తనకు డబ్బు తెచ్చిపెడుతోంది కానీ దాని మీద విమర్శలు, కేసులు చికాకు తెచ్చిపెడుతున్నాయి.
అక్కినేని వారసత్వాన్ని కొనసాగించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. మద్రాసు నుంచి తెలుగు సినిమా పరిశ్రమను హైదరాబాద్ కు తీసుకురావడంలో ఏఎన్నార్ దే అత్యంత కీలక పాత్ర. తన సంపద మొత్తాన్ని ‘అన్నపూర్ణ’ స్టూడియో కోసమే వెచ్చించారు. ఈ స్టూడియో విషయంలోనే తన సమకాలికుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీయార్‌తోనూ ఓ దశలో కయ్యానికి దిగారు. అంతటి ఘన కీర్తి ఉన్న ఏఎన్నార్ వారసుడిగా ఉన్న నాగార్జునను ఇటీవలి కాలంలో చుట్టుముడుతున్న వివాదాలు ఆయన స్థాయిని తగ్గించేలా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఏఎన్నార్ లెగసీపై అందరూ గొప్పగా చెప్తున్నప్పుడు.. ఇటీవల తనకు ఎదురైన ఎన్నో అవమానాలు, బాధలు, వివాదాలు, కష్టాలు ఒక్కొక్కటిగా గుర్తొచ్చి.. నాగార్జున కళ్ల నుంచి నీళ్లు తన్నుకొచ్చాయో అనిపిస్తోంది..!! నాగార్జునను చుట్టుముట్టిన ఈ వివాదాలు, కష్టాలు.. ముఖ్యంగా ఆయన కన్నీరు పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.


