రోడ్డుపై అడుక్కునే అమ్మాయి.. ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో తెలిస్తే, అవాక్కవ్వాల్సిందే!
“నాకే ఆ అవకాశం వచ్చుంటేనా.. నాక్కూడా వాళ్ల అయ్య మాదిరిగా డబ్బు ఉంటేనా.. మా తాత ఆస్తులు అమ్మేకపోతేనా..” ఎవరైనా విజయం సాధించినప్పుడో, ఉన్నత స్థానానికి చేరుకున్నప్పుడో చాలా మంది అనుకునే మాటలివి! కానీ, అవకాశాలను అందిపుచ్చుకొని లేదా వచ్చినదాన్ని వినియోగించుకుని తమ తలరాతను మార్చుకునే వాళ్లు ఈ రోజుల్లో ఎంత మంది ఉన్నారు? అలా మాట్లాడే వారికి ఈ వీడియో ఒకసారి చూపించండి.. అలాగే, జీవితంలో ఏదైనా సాధించాలనే సంకల్పం ఉన్న వాళ్లు ఈ కథనాన్ని చివరికి వరకు కచ్చితంగా చదవండి.
సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం 2004లో..
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో బాగా డబ్బున్న వాళ్ల ఇంట్లో పెద్ద ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ కి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చారు. ధర్మశాలలోని బౌద్ధ మత గురువు దలాలామా ఆశ్రమం నుంచి కూడా కొంత మంది సన్యాసులు ఆ వేడుకకు వచ్చారు. అతిథులందరికీ కమ్మటి భోజనాలు పెట్టారు. తర్వాత, ఆ విస్తరాకులు తీసేసి, బయట చెత్త కుండీలో పారేశారు. అంతే.. అప్పటి వరకు అక్కడే నిలబడి చూస్తున్న భార్యాభర్తలు, నాలుగేళ్ల వయసున్న వాళ్ల కూతురు ఆ చెత్త కుండీ దగ్గరకు వచ్చారు. పారేసిన విస్తరాకుల్లో ఏమైనా తిండి దొరుకుతుందేమో అని ఒక్కో ఆకు తీసి వెతుకుతున్నారు. పక్కనే ఆ చిన్నారి గిన్నె పట్టుకుని నిలబడింది. ఆ భార్యాభర్తలు ఎంగిలాకుల్లో మిగిలిపోయి ఉన్న ఆహార పదార్థాలను ఆ చిన్నారి చేతిలో ఉన్న గిన్నెలో వేస్తున్నారు. ఈ తతంగమంతా ఓ బౌద్ధ సన్యాసి దూరం నుంచి గమనించారు. వారి వద్దకు వెళ్లాలని అనుకున్నప్పటికీ ఆశ్రమంలో పని ఉండటం వల్ల అడ్కడి నుంచి వెళ్లిపోయారు.
వారం రోజుల తర్వాత.. ఆ బౌద్ధ సన్యాసి కూరగాయలు కొనేందుకు మార్కెట్ కు వెళ్లారు. అక్కడ ఓ తల్లి, తన కూతుర్ని వెంటబెట్టుకొని భిక్షాటన చేస్తోంది. ఆ చిన్నారి కూడా కనిపించిన ప్రతి ఒక్కర్నీ డబ్బు అడుగుతోంది. బౌద్ధ సన్యాసి.. ఆ తల్లీకూతుర్లను చూశారు. ఆ రోజు చెత్త కుండీలో ఆహారం తీసుకుంది కూడా వీళ్లేనని నిర్ధారించుకున్నారు. ఈ సారి నేరుగా ఆ బౌద్ధ సన్యాసి ఆ తల్లీకూతురి దగ్గరకు వెళ్లారు. “ఏంటీ ఈ రోజు మీరిద్దరే వచ్చారు.. మీ భర్త ఎక్కడ” అని ఆమెను సన్యాసి అడిగారు. దగ్గర్లో ఓ ఫంక్షన్ జరుగుతుంటే.. భోజనం తీసుకురావడానికి వెళ్లాడని చెప్పారు. ఎందుకిలా భిక్షాటన చేస్తున్నారు.. ఏదైనా పని చేసుకోవచ్చు కదా.. అని ఆ తల్లిని బౌద్ధ సన్యాసి ప్రశ్నించారు. మాకెవ్వరూ పని ఇవ్వడం లేదయ్యా.. ఎవరినైనా పని ఇవ్వమని అడిగితే, మా ఇంటి అడ్రస్ అడుగుతున్నారు. మాకు ఇళ్లే లేదు.. ఏదో ఒక గుడి దగ్గరో, ఏదైనా సత్రంలోనో పడుకుంటాం అని చెప్పింది. ఆమె మాటలు విన్న ఆ బౌద్ధ సన్యాసి చలించిపోయారు.
ఈసారి ఆ సన్యాసి చిన్నారి వంక చూసి.. నీ పేరేంటమ్మా అని అడగ్గా.. పింకీ హర్యన్ అని సమాధానం చెప్పింది. మీ కూతురు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతోందో, పాపని బడికి పంపించవచ్చు కదా.. అని ఆ అడిగారు. మాకు తిండికే దిక్కులేదు, ఇక పాపని బడికి ఎలా పంపగలమయ్యా అని ప్రశ్నించింది. దీంతో, మేమూ ఈ సంవత్సరమే కొత్తగా హాస్టల్ ప్రారంభించాం. మీ కూతుర్ని పంపించండి.. మేము చదువు చెప్పిస్తాం అని అడిగారు. అంతే.. మాకు చదువొద్దు, ఏమీ వద్దు.. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. అని ఆమె గట్టిగా చెప్పింది. కానీ, ఆ బౌద్ధ సన్యాసి మాత్రం.. ఆమెను బతిమిలాడారు. మీ కూతుర్ని హాస్టల్లో చేర్పిస్తే.. ఉచితంగా బట్టలు తీసిస్తాం, మూడుపూటలా అన్నం పెడతాం, చదువు చెప్తాం అని వివరించారు. ఇంతలో ఆ చిన్నారి తండ్రి కూడా అక్కడికి వచ్చారు. దీంతో ఆయనకు కూడా ఆ బౌద్ధ సన్యాసి పరిస్థితిని వివరించారు. మీ పాపని హాస్టల్ లో చేర్పించండి.. మేము బాగా చూసుకుంటాం, వీలైతే మీకు కూడా అక్కడ ఏదో ఒక పని ఇస్తాం అని చెప్పారు. ఇలా కొన్ని గంటల పాటు ఆ బౌద్ధ సన్యాసి ఆ భార్యాభర్తలని బతిమిలాడారు.. చివరికి, ఆ తల్లిదండ్రులు చిన్నారిని హాస్టల్లో చేర్పించడానికి ఒప్పుకున్నారు. అయితే, ఒక కండీషన్ పెట్టారు.. తాము ఎప్పుడు కావాలంటే, అప్పుడు తన కూతుర్ని చూపించాలని తల్లిదండ్రులు షరతు విధించారు. దీనికి ఆ బౌద్ధ భిక్షువు కూడా అంగీకారం తెలిపారు. మొత్తానికి ఆ చిన్నారిని తల్లిదండ్రులు హాస్టల్లో చేర్పించారు.
Read Also
ఆ తల్లిదండ్రులను అతి కష్టం మీద ఒప్పించిన ఆ బౌద్ధ సన్యాసి పేరు జమ్యాంగ్! ఆయన ధర్మశాలలో 2004లో టాంగ్- లెన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ధర్మశాల చుట్టుపక్కల ప్రాంతాల్లో కటిక పేదరికం అనుభవిస్తున్న వారికి సాయం చేయడమే ఈ ట్రస్ట్ లక్ష్యం! ప్రధానంగా పేద పిల్లలకు ఉచితంగా విద్యనందించడంపై జమ్యాంగ్ దృష్టి పెట్టారు. దీని కోసం ఓ పాఠశాలను ఏర్పాటు చేసి, హాస్టల్ వసతి కూడా కల్పించారు.
ఈ పాఠశాల మొదటి బ్యాచ్ విద్యార్థుల్లో పింకీ హర్యన్ కూడా ఒకరు! కానీ, హాస్టల్ సిబ్బందికి పింకీ చుక్కలు చూపించింది. హాస్టల్లో ఉండేది లేదంటూ రోజూ గట్టి ఏడుస్తూ గందరగోళం చేసేది. తనను అమ్మానాన్నల దగ్గరకు తీసుకెళ్లాలని మారం చేసేది. దీంతో తల్లిదండ్రులను పిలిపించి చూపించే వారు.
హాస్టల్ లో ఉండనని పింకీ ఎంతగా ఇబ్బంది పెట్టినా.. అక్కడివాళ్లు మాత్రం ఆమెను ప్రేమగా ఆదరించారు. కొద్ది రోజులకు హాస్టల్లో కొత్త స్నేహితులు జీవితంలోకి వచ్చారు. అలాగే, ట్రస్ట్ సాయంతో పింకీ తండ్రి చెప్పులు, బూట్లు పాలిష్ చేసే పనిలో చేరాడు. పింకీ కూడా వయసు పెరిగే కొద్దీ మెల్లగా పరిస్థితులను అర్థం చేసుకుంది. తన తలరాతను, ఇప్పుడున్న కుటుంబ పరిస్థితినీ మార్చగలిగేది కేవలం చదువు మాత్రమే అని ఆమెకు అర్థమైంది. అప్పటి నుంచి కష్టపడి చదవడం మొదలుపెట్టింది. జమ్యాంగ్ కూడా పింకీలో ఉన్న అసాధారణ నేర్చుకునే సామర్థ్యాన్ని గమనించారు. పింకీ చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
కొన్నాళ్లకే పింకీ చదువులో మంచి ప్రతిభ చూపించింది. క్లాస్ లో తనే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్! అలాగే, హాస్టల్లో కూడా ఎవరితో గొడవలు పడకుండా చాలా క్రమశిక్షణగా ఉండేది. చూస్తుండగానే పింకీ.. పదో తరగతికి వచ్చింది. ఫస్ట్ క్లాస్ లో పాసైంది. తర్వాత, పెద్దయ్యాక ఏమవుతావని పింకీని జమ్యాంగ్ అడగగా.. ఏమాత్రం ఆలోచించకుండా “డాక్టర్” అవుతానని చెప్పింది. డాక్టర్ అవ్వాలంటే, ఆషామాషీ వ్యవహారం కాదు.. ఇంకా కష్టపడి చదవాలని జమ్యాంగ్ చెప్పారు. అప్పటి నుంచి మరింత కసిగా చదవడం మొదలుపెట్టింది. ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు తెచ్చుకుంది. అలాగే, వైద్య విద్య ప్రవేశ పరీక్ష- నీట్‌లోనూ మంచి ర్యాంకు సాధించింది. కానీ, ఇండియాలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఫీజులు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎంబీబీఎస్ చదువుకు అయ్యే ఖర్చు.. పింకీని ముందడుగు వేయనీయలేదు. ఆ సమయంలో యూకేకు చెందిన మరో ట్రస్ట్ ఆమెకు అండగా నిలిచింది. వాళ్ల ఆసరాతో 2018లో చైనాలోని ఓ మెడికల్ కళాశాలలో సీటు సాధించింది. పరిస్థితులను ఎదిరించి కష్టపడి చదివింది. ఇప్పుడు చైనాలో వైద్య విద్యను పూర్తి చేసుకొని సగర్వంగా ఇండియాకు తిరిగి వచ్చింది. పింకీ విదేశాల్లో చదివింది కాబట్టి, ఇండియాలో డాక్టర్ ప్రాక్టీసు చేయాలంటే ఇక్కడ అర్హత పరీక్ష రాయాలి. ప్రస్తుతం ఆ పరీక్ష కోసం సన్నద్ధమవుతోంది.
“2004.. నాకు నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడు జరిగిన సంఘటన నా జీవితాన్నే మార్చేసింది. ఆ రోజుల్లో మెక్‌లియోడ్గంజ్ వీధుల్లో నేను, నా తల్లి నిలబడేవాళ్లం. అక్కడ, దలైలామా ప్రధాన ఆలయానికి చెందిన సన్యాసులు బిస్కెట్లు, పండ్లు, బ్రెడ్ లాంటి ఆహార పదార్థాలను పంచుతుండేవారు. అవి మాకు ఆహారం మాత్రమే కాదు.. ఆ కష్టకాలంలో ఓ భరోసా! చిన్నతనంలో అత్యంత కఠినమైన పరిస్థితులను చూశా. అవే నన్ను కష్టపడి చదివేలా చేశాయి. చిన్నప్పుడు ఏమవుతావంటే అనుకోకుండానే “డాక్టర్” అని సమాధానమిచ్చా. ఇప్పుడా విద్యతోనే పేదవారికి సాయపడాలనుకుంటున్నా” అని పింకీ చెప్పింది.
పింకీ చదువు, తనను మాత్రమే కాదు.. తన కుటుంబ తల రాతనే మార్చేసింది. ఆమె కుటుంబం భిక్షాటన నుంచి పూర్తిగా బయటపడింది. అలాగే, ఆమె తండ్రి చెప్పులు, బూట్లు పాలిష్ చేసే వృత్తి నుంచి దుప్పట్లు, కంబళ్లు అమ్మే వ్యాపారానికి మారారు. పింకీ తమ్ముళ్లు 2011లో దలైలామా ప్రారంభించిన టాంగ్-లెన్ పాఠశాలలో విజయవంతంగా చదువుతున్నారు.
పింకీ సాధించిన ఘనతన చూసిన బౌద్ధ సన్యాసి జమ్యాంగ్ ఆనందంతో మురిసిపోయారు. “పింకీ లాంటి పిల్లలకు కనీసం ప్రాథమిక విద్య నేర్పిద్దామని మొదట అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ పిల్లలే తమ విజయాలతో సమాజాన్ని గర్వపడేలా చేస్తున్నారు.” అని జమ్యాంగ్ భావోద్వేగం చెందారు.
జమ్యాంగ్ కృషి, పింకీ పట్టుదల గురించి టాంగ్ లెన్ ట్రస్ట్ తో అనుబంధం ఉన్న, ఉమంగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు అజయ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. “జమ్యాంగ్.. నిరుపేద పిల్లల్ని కేవలం డబ్బు సంపాదించే యంత్రాలుగా మార్చకుండా, మంచి మనుషులుగా తీర్చిదిద్దుతున్నారు. ఆయన త్యాగం వల్ల చాలా మంది మాజీ భిక్షగాళ్లు.. ఇప్పుడు వైద్యులు, ఇంజనీర్లు, జర్నలిస్టులుగా స్థిరపడుతున్నారు” అని చెప్పారు.
బెగ్గర్ నుంచి ఎంబీబీఎస్ డాక్టర్ వరకు ఎదిగిన పింకీ ప్రస్థానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read Also






