రతన్ టాటా జీవితంలో చీకటి కోణం.. ఓ అనాథ ఒంటరి పోరాటం
తన్ నావల్ టాటా అలియాస్ రతన్ టాటా.. దేశం గర్వించ దగ్గ గొప్ప పారిశ్రమికవేత్త! విలువలే పెట్టుబడిగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించారు.
సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్.. రతన్ టాటా! ఏ రంగంలో అడుగుపెట్టినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తన ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు. సేవా గుణంలో ఆయన్ను మించిన వ్యాపారవేత్త లేడంటే అతిశయోక్తి కాదేమో! ఈ దేశంలో అతి సామాన్యుడి కోసం ఆలోచించిన ఏకైక పారిశ్రామికవేత్త కూడా రతన్ టాటానే అని ఘంటాపథంగా చెప్పవచ్చు. రతన్ టాటా జీవితంలో ఎన్నో సక్సెస్ స్టోరీలు ఉన్నాయి. నష్టాల్లో కూరుకుపోయిన ఎన్నో కంపెనీలను లాభాల్లోకి తెచ్చిన ఘనత ఆయనది! జీవితంలో అనేక విజయాలు కళ్లారా చూశారు.
కానీ, రతన్ టాటా వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయి. పుట్టుకతోనే కోటీశ్వరుడైనా.. జీవితంలో ఆయనకేదీ సులభంగా దక్కలేదు! తల్లిదండ్రుల నుంచి ప్రియురాలు వరకు “నా” అనుకున్న ప్రతి ఒక్కరూ దూరమయ్యారు.. కాదు కాదు.. ఆయన్ను దూరం పెట్టారు! ఆ ఒంటరితనాన్ని భరించలేక వ్యాపారరంగంలో తలమునకలయ్యారు. రతన్ టాటా కెరీర్ లో ఎంత సక్సెస్ అయినా.. వ్యక్తిగతంగా ఎన్నో కోల్పోయారు. ఆ ఒంటరితనం రతన్ టాటాను జీవితాంతం వెంటాడింది.
జీవితంలో ఎన్నో సాధించిన రతన్ టాటా.. జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను ఈ కథనం ద్వారా తెలుసుకుందాం!
రతన్ టాటాను వదిలేసిన తల్లిదండ్రులు
బ్రిటిష్ ఇండియాలోని బొంబాయి నగరంలో నవల్ హోర్మూజీ టాటా, సూని టాటా దంపతులకు మొదటి సంతానంగా 1937 డిసెంబర్ 28న రతన్ టాటా జన్మించాడు. వీరికి రెండో సంతానంగా జిమ్మీ టాటా పుట్టాడు. అయితే.. రెండో కొడుకు పుట్టిన కొన్నాళ్లకే నవల్ టాటా, సూని దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంట్లో ఎప్పుడూ అశాంతి వాతావరణం ఉండేది. రతన్ టాటాకు 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, చిన్న కొడుకు జిమ్మీని తల్లి తీసుకుంటానని చెప్పింది. కానీ, రతన్ టాటాను మాత్రం తల్లిదండ్రులు ఇద్దరూ వద్దనుకున్నారు. రతన్ టాటాను అనాథ శరణాలయంలో చేర్పించాలని భావించారు.
ఈ విషయం రతన్ నాన్నమ్మ నవాజ్‌బాయి టాటాకు తెలిసింది. వెంటనే ఆమె అధికారికంగా రతన్ టాటాను దత్తత తీసుకున్నారు. కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నారు. తల్లిదండ్రులు విడిపోవడం వల్ల రతన్ టాటా, ఆయన తమ్ముడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఆ రోజుల్లో మహిళలు రెండో పెళ్లి చేసుకోవడం చాలా అరుదు! కానీ, తన తల్లి రెండో వివాహం చేసుకున్నదని రతన్ టాటాను స్కూల్లో స్నేహితులు ర్యాగింగ్ చేసే వారు. దీంతో అంత చిన్న వయసులో తల్లిదండ్రులు తనను ఎందుకు వదిలేశారో తెలియక రతన్ రోజూ వెక్కివెక్కి ఏడ్చేవాడట!
హోటళ్లలో అంట్లు తోమిన టాటా
దీని వల్ల రతన్ టాటా తరచూ స్కూల్స్ మారేవాడు. ముంబైలోని క్యాంపెయిన్ స్కూల్, కాథడ్రెల్, జాన్ కానన్ పాఠశాలల్లో చదువుకున్నారు. ఇండియాలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. అక్కడకి వెళ్లాకే జీవితం అంటే ఏంటో రతన్ టాటాకు పూర్తిగా అర్థమైంది. అప్పట్లో ఇండియా నుంచి అమెరికాకు డబ్బు పంపడం అంత సులువైన పని కాదు. అప్పటి రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం విదేశాలకు కొద్ది మేరకే డబ్బు పంపించడానికి వీలుండేది. దీంతో రతన్ కు ఇండియా నుంచి వచ్చే ఒకటీ అరా డాలర్లు దేనికీ సరిపోయేవికావు. దీని వల్ల రతన్ కు ఇండియాలో కోట్ల రూపాయిల ఆస్తులున్నా.. అమెరికాలో మాత్రం పేదవాడిగా మిగిలిపోయారు. చదువు, ఇతర ఖర్చుల కోసం రతన్ టాటా అమెరికాలో చిన్నాచితకా ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. కొంతకాలం హోటళ్లలో అంట్లు కూడా తోమారట! ఇలా ఎన్నో కష్టాలు ఎదుర్కొని మొత్తానికి కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ ఆర్కిటెక్చర్ పట్టా పొందాడు.
Read Also
పీకల్లోతు ప్రేమ.. బ్రేకప్
తర్వాత, రతన్ టాటాకు 25 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు అమెరికాలోని లాస్ఏంజెల్స్లో ఓ ఆర్కిటెక్చర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలోనే ఓ మహిళతో ప్రేమలో పడ్డారు. చిన్నప్పుడే తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన రతన్ టాటా.. ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ఆమె కూడా రతన్ ను ప్రేమించింది. ఇంట్లో పెద్దవాళ్లకు ఈ విషయం చెప్పారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా పెళ్లికి ఓకే చెప్పారు. దీంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని అమెరికాలోనే స్థిరపడిపోవాలని రతన్ టాటా నిర్ణయించుకున్నారు.
కానీ, ఇదే సమయంలో ఓ సమస్య వచ్చి పడింది. చిన్నప్పటి నుంచి తనను పెంచి పెద్ద చేసిన నాన్నమ్మ నవాజ్ బాయికి ఆరోగ్యం క్షీణించింది. వెంటనే, ఇండియాకి వచ్చేయాలని కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో 1962లో రతన్ టాటా హుటాహుటిన ఇండియాకు బయల్దేరి వచ్చేశారు. తన కోసం ప్రేయసి కూడా భారత్ వస్తుందని రతన్ ఆశించారు.
కానీ, ఇంతలో భారత్- చైనా మధ్య యుద్ధం మొదలైంది. దేశంలో పరిస్థితులు క్షీణించాయి. అంతర్జాతీయంగానూ ఈ ప్రభావం పడింది. దీంతో అమ్మాయి తల్లిదండ్రుల్లో భయం ముదలైంది. అప్పట్లో మాట్లాడుకోవడానికి ఫోన్లు కూడా ఉండేవి కాదు. దీంతో భారత్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అనే ఆందోళనలో పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ కూతురిని భారత్ కు పంపించడానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పకోలేదు.
కట్ చేస్తే.. యుద్ధం ముగిసి, పరిస్థితులు చక్కబడ్డాక.. తన ప్రియురాలి కోసం రతన్ టాటా తిరిగి అమెరికాకు తిరిగి వెళ్లాడు. అప్పుడే రతన్ టాటాకు ఊహించని షాక్ తగిలింది. గాఢంగా ప్రేమించిన అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు వేరే పెళ్లి చేసేశారు. దీంతో రతన్ టాటాకు ఏం చెయ్యాలో తోచలేదు. ఆ తర్వాత తిరిగి ఇండియాకు వచ్చేశారు. ఇలా రతన్ టాటా తొలి ప్రేమ.. ఆయనకు జీవితాంతం గుర్తుండిపోయే ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది.
సాధారణ ఉద్యోగిగా అసాధారణ ప్రతిభ
ఇక, ప్రియురాలిని మర్చిపోయేందుకు రతన్ టాటా పనిలో పడ్డాడు. కానీ, అమెరికాలో చదువుకొని వచ్చిన తాను.. సొంత కంపెనీలోనే చిన్న ఉద్యోగిగా పని చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఊహించలేదు. రతన్ తండ్రి నవల్.. టాటా గ్రూపులో డిప్యూటీ చైర్మన్ గా ఉన్నప్పటికీ ఆయనకు పెద్ద పోస్టేమీ ఇవ్వలేదు. మొదటగా జంషెద్ పూర్ లోని స్టీల్ ఉత్పత్తి విభాగంలో ఓ సాధారణ ఉద్యోగిగా రతన్ టాటా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కొన్ని వేల మంది కార్మికులతో కలిసి నిప్పుల కొలిమి దగ్గర కూడా 9 గంటల పాటు పని చేసేవారట. ఇలా టాటా కంపెనీలో 9 సంవత్సరాల పాటు వివిధ విభాగాల్లో చిన్న చిన్న పోస్టుల్లో పని చేశారు.
ఆ తర్వాత రతన్ టాటా కి 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ గా గొప్ప అవకాశం వరించింది. అయితే రతన్ టాటాకు అదేమీ ఎగిరి గంతేసే విషయం కాదు. ఎందుకంటే అప్పటికే ఆ సంస్థ 40 శాతం నష్టాల్లో కూరుకుపోయి ఉంది. కానీ, రతన్ టాటా దీన్నొక ఛాలెంజ్ గా తీసుకున్నారు. సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా పని చేశారు. ఇదే సమయంలో రతన్ చేస్తున్న కృషిని సంస్థ ఛైర్మన్ JRD టాటా గమనించారు. వెంటనే తన సొంత కంపెనీలోనే గొప్ప పోస్ట్ ఇచ్చారు. దీనిపై కంపెనీలోని చాలా మంది సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద పోస్టు ఒకేసారి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు.
కానీ, పనితోనే వారికి సమాధానం చెప్పాలని రతన్ టాటా నిర్ణయించుకున్నారు. రతన్ పగ్గాలు చేపట్టినప్పుడు కంపెనీ ఉత్పత్తులు మార్కెట్ లో కేవలం రెండు శాతం మాత్రమే ఉండేవి. కానీ, రతన్ అడుగుపెట్టిన తర్వాత మార్కెట్ వాటా ఒకేసారి 25 శాతానికి పెరిగింది. 1975 సంవత్సరంలో ఈ కంపెనీకి సంబంధించిన లాభాలు ఏకంగా 113 కోట్ల రూపాయిలకు ఎగబాకాయి. దీంతో రతన్ టాటా పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. టాటా కంపెనీలోనూ రతన్ టాటా స్థాయి అమాంతం పెరిగిపోయింది.
పెళ్లంటే అందుకే భయం..
కెరీర్ లో సక్సెస్ అయిన తర్వాత 1970ల్లో హిందీ చిత్రసీమలో ప్రముఖ నటీమణిగా వెలుగొందిన సిమీ గరేవాల్‌కు రతన్ దగ్గరయ్యారు. ఇద్దరూ బీచ్ లు, పార్క్ ల వెంట జోరుగా తిరిగారు. వీరి అనుబంధం పెళ్లి పీటల వరకు వెళుతుందని ఆశించినా అది జరగలేదు. సిమీ మరొకరిని పెళ్లాడగా రతన్ టాటా మళ్లీ ఒంటరయ్యారు. ఇలా మొత్తం నాలుగు సందర్భాల్లో ఆయన పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమై.. వేర్వేరు కారణాలతో అవేవి జరగక చివరికి, ఆజన్మబ్రహ్మచారిగానే ఉండిపోయారు.
కెరీర్ లో ఎంత సక్సెస్ అయినా, వ్యక్తిగత జీవితం విషయంలో మాత్రం రతన్ టాటాకు ఎప్పుడూ అసంతృప్తి ఉండేది. తన వ్యక్తిగత జీవితం గురించి రతన్ టాటా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను మొత్తం నాలుగు సార్లు ప్రేమలో పడ్డానని, అయితే క్లిష్ట పరిస్థితుల కారణంగా తమ బంధం పెళ్లి వరకు వెళ్లలేదని చెప్పారు. నాలుగు ప్రేమలు విఫలం కావడానికి కారణాలు ఏంటని ప్రశ్నించగా.. “అమెరికా అమ్మాయితో ప్రేమ విఫలమైన తర్వాత.. మరో ముగ్గురితో ప్రేమలో ఉన్నప్పటికీ, వారిని పెళ్లి చేసుకోకూడదని భావించాను. ఎందుకంటే, ప్రతిసారీ ఏదో ఒక రకమైన భయంతో నేను వెనక్కి తగ్గాను.
పెళ్లి విషయంలో నా భయానికి కారణం ఏమంటే.. నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు విడిపోయారు. దీని వల్ల నేను, నా తమ్ముడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నా తల్లి రెండో పెళ్లి చేసుకున్న సమయంలో, స్కూల్లో స్నేహితులు ర్యాగింగ్ చేసే వారు. ఇవన్నీ నాలో బలంగా నాటుకొనిపోయాయి.
రతన్ టాటా గొప్పతనం ఇదే..
ఇదే సమయంలో సమాజంలో గౌరవంగా బ్రతకాలంటే.. భార్యాభర్తలు గొడవలు పడకూడదని మా నాన్నమ్మ నాకు నేర్పించింది. బిజినెస్ లో సక్సెస్ సాధించిన తర్వాత చాలా సమయాల్లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. కానీ, వ్యాపార రంగంలో బిజీ కావడం వల్ల.. కుటుంబానికి సమయం కేటాయించలేమో అన్న భయం నన్ను వెంటాడేది. ఒకవేళ పెళ్లయ్యి పిల్లలు పుట్టిన తర్వాత, భార్యతో గొడవపడి విడిపోతే.. పిల్లలు మాలాగే బాధపడతారేమో అనిపించింది. అందుకే చాలాసార్లు వైవాహిక జీవితంలోకి అడుగుపెడదామని భావించినా.. భయపడి చేసుకోలేదు. ఇప్పుడు బాగా పెద్దవాడిని అయిన తర్వాత నాకు భార్య, పిల్లలు ఉంటే బాగుండేదేమో అనిపిస్తోంది. ఒక్కోసారి నేను ఒంటరి వాడినని అనిపిస్తుంది.” అని రతన్ టాటా తన మనసులోని బాధలను బయటపెట్టారు.
రతన్ టాటాలో ఉన్న గొప్పతనం ఏంటంటే.. తన ప్రేమ విఫలమైనందుకు ఎవర్నీ ఎప్పుడూ నిందించలేదు. పరిస్థితులే తన ప్రేమను.. పెళ్లి వరకూ తీసుకురాలేదని చెప్పేవారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన మహిళలు సైతం ఏనాడూ ఆయన్ను తప్పుబట్టిన సందర్భం కూడా లేదు.
మొత్తానికి కెరీర్ లో ఎన్నో సక్సెస్ లు చూసిన రతన్ టాటా.. జీవితంలో ఒంటరిగా మిగిలిపోయి కన్నుమూశారు.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి.. కానీ, వాటిని ఎదుర్కొన్ని పోరాడిన వాళ్లే సక్సెస్ అవుతారు. రతన్ టాటా లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే, రతన్ టాటా ఎలా సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ అయ్యారు.. జేఆర్డీ టాటాని మెప్పించి ఎలా కంపెనీ ఛైర్మన్ అయ్యారో తెలుసుకోవాలంటే వీడియో పార్ట్-2 కావాలని కామెంట్ చేయండి. రతన్ టాటా లైఫ్ స్టోరీ పార్ట్-2 వీడియోని తీసుకొస్తాం.





